‘ ఓట్లేసే ప్రజలు ఉండాలి కానీ గుర్తు పెద్ద సమస్య కాదు. తాము ఓటు వేయాలనుకున్న పార్టీకి ఏ గుర్తు ఉంటే వెదుక్కుని ఆ గుర్తుకు వేస్తారు. అయితే కొంత మందికి గుర్తుల సెంటిమెంట్ ఉంటుంది. వైఎస్ఆర్ తెలంగాణ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు కూడా అలాంటి గుర్తు సెంటిమెంట్ ఉందేమో కానీ.. ఈసీ ఇచ్చిన బైనాక్యూలర్స్ గుర్తును వద్దని .. తాము అడిగిన గుర్తుల్లో ఉన్న వాటినే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం కామన్ గుర్తుగా బైనాక్యూలర్స్ కేటాయించింది.
ఆ పార్టీ పోటీ చేసిన అన్ని చోట్లా అదే గుర్తును కేటాయిస్తారు. అయితే అంతకు ముందు షర్మిల తమ పార్టీకి నాగలి గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకుంది. అయితే ఆ గుర్తు ఖాళీ లేదు. దీంతో తమ రూల్స్ ప్రకారం వెళ్లి బైనాక్యూలర్స్ గుర్తు కేటాయించారు. అయితే ఈ గుర్తు కాకుండా ఇంకాఎవరికి కేటాయించకుండా ఉన్న బాల్ లేదా అగ్గిపెట్టే గుర్తులను కేటాయించాలని కోరుతూ తాజాగా లేఖరాశారు. నామినేషన్ల గడువు ముంచుకు వస్తున్నా.. షర్మిల పార్టీకి అభ్యర్థులు లేరు. కనీసం ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టడానికి దరఖాస్తులు చేసుకున్న వారు కూడా లేరు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో కూడా స్పష్టత లేదు.
చివరికి తాను పాలేరులో పోటీ చేస్తానని చెబుతున్నారు కానీ అక్కడ ఎన్నికల సన్నాహాలు చేస్తున్న వారు కూడా లేరు. పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో నియోజకవర్గ స్థాయి నేతలు లేరు. మొదట్లో పార్టీలో చేరిన కొంత మంది పార్టీ మారిపోయారు. ఈ సమస్యల కన్నా.. గుర్తు గురించే షర్మిల ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు.