అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని… కాంగ్రెస్‌కు ఈ సారి చాన్స్ ఇద్దామని కొత్త నేతలు వచ్చారని అనుకునే ప్రజలకు సీనియర్లు … అలాంటి ఆలోచనే పెట్టుకోవద్దన్న సంకేతాలు ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. జానారెడ్డి తాను సీఎం అవుతానని అంటూంటే.. జగ్గారెడ్డి వచ్చే పదేళ్లకైనా తానే సీఎంనని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇక వీహెచ్ .. అంబర్ పేట టిక్కెట్ కోసం రచ్చ చేస్తున్నారు. అప్పుడెప్పుడో జమానా కిందట ఓ సారి అంబర్ పేట నుంచి గెలిచి మంత్రిగా చేసిన వీహెచ్… మళ్లీ కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేదు. అయినా అంబర్ పేట తన ఆస్తి అనుకుంటున్నారు.
అంబర్ పేట టిక్కెట్ తన కోటా అని..తాను చెప్పిన వారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరే నేతలను సిఫారసు చేశారు. కాంగ్రెస్ ఓబీసీ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కు ఇవ్వాలని అంటున్నారు. కానీ వీహెచ్ మాత్రం… లక్ష్మణ్ యాదవ్ అనే తన అనుచరుడికి ఇవ్వాలంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉత్తమ్‌తో పాటు ఆయన భార్యకు మాత్రం సీట్లు కావాలి.. తనకు మాత్రం వద్దా అంటూ మండి పడుతున్నారు. ఉత్తమ్ రెడ్డి చాలా మంది నేతల్ని బయటకు పంపారని ఆరోపిస్తున్నారు.
గతంలో అంబర్ పేట టిక్కెట్ తీసుకుని నాలుగో స్థానంలో నిలిచారు వీహెచ్. అక్కడ ఆయన పలుకుబడి పూర్తిగా పతనమైపోయింది. గట్టి అభ్యర్థులు అనుకునేవారికి కాంగ్రెస్ హైకమాండ్ టిక్కెట్ ఇస్తుంది. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. తాను కూడా ఉన్నానని.. తాను ఉండగా కాంగ్రెస్ పార్టీ బాగుపడటం.. సంస్కృతిని మార్చుకోవడం సాధ్యం కాదన్నట్లుగా వీహెచ్ తెరపైకి వచ్చారు. హైకమాండ్ ఏం చేస్తుందో మరి!