తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హఠాత్తుగా మంగళవారం ఉదయం కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెంటనే స్పందించారు. అతి తప్పుడు ప్రచారం అన్నారు. అయితే టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన చెప్పలేదు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
తెలంగాణ ఎన్నికల కేంద్రంగా టీడీపీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. టీడీపీ , బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఓ సారి.. టీడీపీ పోటీ నుంచి వైదొలుగుతుందని మరోసారి ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం ఎన్నికలకు సన్నాహాలు చేసుకోవడం లేదు. చంద్రబాబు అరెస్ట్ అయిన మొదట్లో.. బాలకృష్ణ .. తెలంగాణ టీడీపీ కి తానున్నానని ముందుకు వచ్చారు. తర్వాత సైలెంట్ అయ్యారు. అంటే.. టీడీపీ విషయంలో విధానపమరైన నిర్ణయం తీసుకున్నారేమోనని అందుకే ఆయన కూడా పట్టించుకోవడం లేదని అనుకోవడం ప్రారంభించారు.
చంద్రబాబు కూడా గతంలో ఓ సారి కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయినప్పుడు ఏ విషయం చెప్పలేదు. కానీ ఆ సమావేశం తర్వాత కాసాని 75 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసుకున్నారు. పోటీ చేస్తామని అంటున్నారు. అయితే చంద్రబాబు నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. టీడీపీ పోటీ చేయకపోతేనే మంచిదన్న వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. పార్టీ పరంగా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఆ నిర్ణయంపై పార్టీ నేతలు ఎలా స్పందిస్తారన్నది బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.