వైసీపీ ఎంఎల్ఎ రోజా ఏడాదిపాటు సస్పెన్షన్ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లారు.5వ తేదీన సమావేశాలు మొదలవుతున్నాయి గనక ఆలోగానే విచారించాలని పై వరకూ ఫిర్యాదు చేశారు. కాని కోర్టు ఆ అభ్యర్థనను మన్నించలేదు. ఈ లోగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏర్పాటు చేసిన కమిటీ రోజా సమస్యను చర్చించి నివేదిక ఇచ్చింది. అది ఏకపక్షంగా వుందని వైసీపీ ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ముందే ప్రకటించారు. రోజాకు తగు శిక్ష విధించాలని కమిటీ సిపార్సు చేసింది. అంటే విధించిన దాన్ని తగ్గించడం పరిశీలించడం కాదని అర్థం. మరోవైపున వైసీపీ రోజానే తమ మీడియా గోష్టుల్లో ముందుంచి తీవ్రంగా విమర్శలు ఆమెతో చేయిస్తుంది. ఇవి ప్రభుత్వం కక్షను మరింత పెంచుతాయి. ప్రభుత్వం సంగతి అలా వుంచితే సభలో అత్యున్నత బాధ్యత వహించే నాయకుడు కూడా ‘ మళ్లీ ఆమె మొహం చూడాలనుకోవడం లేదు’ అని ఖచ్చితంగా వ్యాఖ్యానించారట. కనుక ఏం జరిగేది వూహించడం కష్టమేమీ కాదు
ఇక తెలంగాణ శాసనసభలోనైతే గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలితే ఏడాదిపాటు సస్పెన్షన్కు గురిచేయాలనే కఠినమైన సరికొత్త నిబంధనను ప్రతిపాదించనున్నట్టు కథనాలు వచ్చాయి.గవర్నర్ స్థానం గౌరవ ప్రదమైంది గనక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఇప్పుడు శాసనసభా వ్యవహారాల మంత్రిగా వున్న హరీష్ రావు స్వయంగా ఇదే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంలో పేరు గాంచారు. ఆయనతో పోటీ పడిన వ్యక్తి తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి. ఇప్పుడు హరీష్ పాత్ర మారింది గాని రేవంత్ నిరసన పాత్రలోనే వున్నారు. గత సమావేశాలలో కూడా ఒకసారి ఆయనను దీర్ఘకాలం పాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రతిపాదన కూడా ఆయనను దృష్టిలో పెట్టుకుని చేసిందేనని భావిస్తున్నారు. తెలుగుదేశం శాసనసభా పక్షం దాదాపు ఖాళీ అయిపోయిన నేపథ్యంలో రేవంత్ గట్టిగా నిరసన తెల్పితే వేటు వేయడానికి వీలుగానే ఈ నిబంధన తెస్తున్నారా? పైగా ఇన్నాళ్లు ఫిరాయించిన వారిపై మౌనం వహించి స్పీకర్ మధుసూదనాచారి ఇప్పుడు కొత్తగా చేరిన ఎర్రబెల్లి దయాకరరావు ప్రభృతులకు నోటీసు ఇవ్వడం హాస్యాస్పదంగా వుంది. వారినుంచి విలీనం లేఖ కూడా అందుకున్నారు గనక దాన్నే వారు తమ సమాధానంలో పునరుద్ఘాటించడం, ఆయన ఆమోదించడం జరగొచ్చు. అప్పుడు గనక సభలో రభస జరిగితే ఈ సస్పెన్షన్ వేటు వేయొచ్చు. ఇక తెలుగుదేశం ఉనికి దాదాపు లేకుండా పోతుంది. జరగబోయేది అదేనా? చూడాలి!