తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా బీసీ అయిన బండి సంజయ్ దూకుడుగా పోరాడుతూ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దుతూ ఉంటే .. కేసీఆర్ తో రాజీపడిపోయి ఆయన పదవిని ఊడగొట్టేసి కిషన్ రెడ్డిని కూర్చోబెట్టిన బీజేపీ హైకమాండ్ ఎన్నికల ప్రచారంలో కొత్త వాదన వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎంను చేస్తారట. సూర్యాపేట బహిరంగసభకు హాజరైన అమిత్ షా ఈ మేరకు ప్రకటన చేశారు. ఆయన మాటలు విన్నతర్వాత అందరికీ బండి సంజయ్యే గుర్తుకు వచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గానే బీసీని ఉండనీయలేదు.. ఒక వేళ అధికారం వస్తే బీసీని సీఎంను చేస్తారా అని గుసగుసలాడుకున్నారు.
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. బీజేపీ ఇప్పుడు రేసులో ఉండేది. కేసీఆర్ ను ఢీ కొట్టే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎవరికీ తలొగ్గకుండా.. కేసులు పెట్టినా.. దాడులు చేసినా పోరాడి బీజేపీని ఓ స్థాయికి తీసుకు వచ్చారు. గతంలో ఎవరికీ సాధ్యం కానంత గొప్ప పనితీరు చూపి పార్టీని మెరుగుపర్చారు. కానీ ఎన్నికలకు ముందు ఎందుకు మార్చారో ఎవరికీ తెలియదు. కిషన్ రెడ్డి చేతికి పార్టీని అప్పగించడంతో అసలుకే మోసం వచ్చింది. బీజేపీ రేసులో లేకుండా పోయింది.
బండి సంజయే చీఫ్ గా ఉండి.. ఇప్పుడు బీసీ నినాదం వినిపించి ఉంటే.. ఖచ్చింగా ఆ ఇంపాక్ట్ ప్రజల్లో ఉండేదన్న అభిప్రాయం ఉంది. గతంలో కేసీఆర్ దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటన చేశారు. దళితుడ్ని సీఎం చేయకపోతే తన మెడ నరుక్కుంటానని చాలెంజ్ చేసేవారు. అయితే ఎప్పుడూ ఆయన దళితుడ్ని సీఎం చేయలేదు. మెడ నరుక్కోలేదు. తర్వాత దళితులే పదవి వద్దన్నారని వాదించారు. ఇక్కడ బీజేపీ అసలు రేసులో లేదు కాబట్టి.. బీసీ సీఎం నినాదం ఇస్తున్నారు. దీని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందో ఉండదో కానీ.. బండి సంజయ్ కు చేసిన అన్యాయం మాత్రం అందిరికీ గుర్తొస్తుంది.