ఎన్టీఆర్ బిడ్డ నారా భువనేశ్వరి ప్రజల్లోకి వస్తున్నారు. తన భర్త చంద్రబాబునాయుడ్ని అక్రమంగా జైల్లో బంధించడంపై నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును చూసి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాను నేటి నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి పేరుతో ఈ యాత్ర చేపట్టనున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభంకానుంది. నేటి నుంచి వారానికి మూడు రోజుల పాటు కార్యకర్తలు, నేతల ఇళ్లకు వెళ్లి భవనేశ్వరి ధైర్యం చెబుతారు. అండగా ఉంటామని భరోసా ఇస్తారు.
నిజం గెలవాలి పేరుతో చేపట్టే యాత్రలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడమే కాకుండా సభలు, సమవేశాల్లో పాల్గొంటారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు అని ప్రజలకు తెలియజేయనున్నారు. ఆయన అరెస్టు వెనుక ఏం జరిగిందో చెప్పనున్నారు. నారావారిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి యాత్ర ప్రారంభిస్తారు. ముందుగా చంద్రగిరికి చెందిన ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. పాకాల మండలం నేండ్రగంటకు చెందిన చిన్నస్వామి నాయుడి ఫ్యామిలీని కలుసుకుంటారు. సాయంత్రానికి చంద్రగిరి మండలం అగరాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడతారు. సాయంత్రానికి నారావారిపల్లిలో బస చేసి గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు.
భువనేశ్వరి రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలు చూస్తారు. సేవా కార్యక్రమాలు చేపడతారు. అయితే ఆధారాలు లేని స్కిల్ కేసులో.. కేవలం రాజకీయ కారణాల కోసం అరెస్టు చేసి.. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబును సుదీర్ఘ కాలం జైల్లో ఉంచుతున్నారు. అవినీతికి కనీస ఆధారాలు లేకపోయినా … తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించే లక్ష్యంతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు.