ఈ ఏడాది వర్షాకాలం వచ్చిందనే పేరే కానీ .. ఒకటి రెండు వర్షాలు మాత్రమే పడ్డాయి. రిజర్వాయర్లలోకి నీళ్లు రాలేదు. చెరువుల్లో తడి లేదు. ఎండలు మాత్రం ఎండా కాలం మాదిరిగా ఉన్నాయి. ఏపీలో పంటలు నాశనమవుతున్నాయి. ఇప్పటివరకు 50 శాతం విస్తీర్ణంలోనే సాగులో ఉంది. అందులోనూ నీరు లేక.. కరెంట్ ఇవ్వక పంటలు ఎక్కువగా ఎండిపోతున్నాయి. వర్షాభావం వల్ల గుంటూరు, ప్రకాశం నెల్లూరు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోసాగు రంగంపై తీవ్ర ప్రభావం పడింది.
కొన్ని జిల్లాల్లో బోర్ల ద్వారా నీటి వనరులు అందుబాటులో ఉండడం వల్ల రైతులు కొంత తేరుకుంటున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్లతో నీరు తెచ్చి భూమిని తడిపి పొగాకు నాటుతున్నారు. ఆ తర్వాత మొక్కలు నిలదొక్కుకోవడానికి ఎరువులు, నీటిని వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఎకరాకు అదనంగా రూ.6 నుంచి రూ.10 వేల వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అనేక జిల్లాల్లో ఎండల తీవ్రత వల్ల మొక్కలు నిలదొక్కుకోవడం లేదు. దీంతో, నాట్లు వేసిన కొద్ది రోజులకే ఎండిపోయిన పైరును తొలగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో వేరు శనగ పంట పూర్తిగా దెబ్బతిన్నది.
పరిస్థితి దారుణంగా ఉంది కానీ ప్రభుత్వం మాత్రం.. .. వర్షాలు పడకపోతే మేమేం చేస్తామని సైలెంట్ గా ఉంది . రైతులను గైడ్ చేయడం లేదా… నీటి కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వంటివి చేయలేదు. దీంతో రైతులు మరింత ఎక్కువగా నష్టపోయారు. ఓ వైపు కృష్ణా జలాలపై హక్కులు కోల్పోతూంటే చూస్తూ ఊరుకున్నారు. మరో వైపు కరువు మీద పడితే.. మాకేం సంబంధం అన్నట్లుగా ఉన్నారు. ఈ పరిపాలన చూసి రైతులు కూడా.. గొల్లుమంటున్నారు.