భారత దేశంలో కమ్యూనిస్టులకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. పీడిత ప్రజల కోసం పోరాటంలో సీపీఐ నుంచి సీపీఐ-మావోయిస్టు వరకూ పదుల సంఖ్యలో వామపక్ష పార్టీలు ఆవిర్భవించాయి. వీటిలో ఎంఎల్ పార్టీలుగా పేరు పొందినవి బ్యాలెట్ కు బదులు బుల్లెట్ ను నమ్ముకున్నాయి. ఒకప్పటి పీపుల్స్ వార్ గ్రూపే సీపీఐ మావోయిస్టుగా పేరు మార్చుకుంది. బ్యాలెట్ ను నమ్ముకున్న ప్రజాస్వామిక వామపక్షాల్లో ప్రస్తుతం సీపీఎ బలంగా ఉంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు ఒకేసారి రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. బెంగాల్ లో మమతా బెనర్జీ ధాటికి లెఫ్ట్ కంచు కోట బద్దలైంది. కేరళలో ఆనవాయితీ ప్రకారం ఆనాటి ఎల్ డిఎఫ్ ఓడి, కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ గెలిచింది.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగింది. బెంగాల్లో ఆరు విడతల్లో, కేరళలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. దీనికోసం వామపక్షాలు చాలా కాలంగా సన్నద్ధమవుతున్నాయి. బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించడానికి సీపీఎం తహతహలాడుతోంది. అయితే అది అంత సులభం కాదని కామ్రేడ్లు భావిస్తున్నట్టున్నారు. అందుకే, పొత్తుకోసం కాంగ్రెస్ అందించిన స్నేహ హస్తం అందుకోవాలా లేదా అని మల్లగుల్లాలు పడుతున్నారు. మామూలుగా అయితే కాంగ్రెస్ తో పొత్తు అనగానే నో చెప్పాలి. కానీ ఈసారి సీన్ మారిపోయింది. బెంగాల్లో మమతను ఢీకొట్టాలంటే మరింత బలం కావాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే విమర్శలు వస్తాయేమో అనే అనుమానం కలుగుతోంది. కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అక్కడ ఈ రెండే ప్రధాన ప్రత్యర్థులు. కాబట్టి బెంగాల్లో హస్తంతో చేయి కలిపితే కేరళలో పోరాటం ఎలా అనేదే ప్రశ్న.
బెంగాల్లో ఈసారి అనూహ్యంగా బీజేపీ కూడా కొంత పుంజుకుంది. ఆశ్చర్యకరంగా సీపీఎంతో సమానంగా ఎంపీ సీట్లు గెల్చుకుంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ చెరి రెండు సీట్లు నెగ్గాయి. పైగా, బీజేపీ దాదాపు 18 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థులకు సవాలు విసిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికి కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. బీర్ భూమ్, తదితర జిల్లాల్లో హిందువులతో పాటు వేల సంఖ్యలో ముస్లింలు కూడా ఈమధ్య బీజేపీలో చేరారు. ఇదే ఇప్పుడు మమతకు, వామపక్షాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహకారం తప్పనిసరి కావచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే పరోక్ష సహకారం మంచి మార్గమని వామపక్ష నేతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మమత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదని, కొత్త పరిశ్రమలు రాలేదని, అన్ని వర్గాల ప్రజలకూ కష్టాలే తప్ప ఎలాంటి మేలు జరగలేదని లెఫ్ట్ నేతలు విమర్శిస్తున్నారు.
కేరళలో ఒక ఆనవాయితీ ఉంది. ప్రతి సారీ ప్రభుత్వాన్ని మార్చడం ఓ సంప్రదాయంగా మారింది. ఆ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓడిపోతుందా, వామపక్షాలు అధికారంలోకి వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు మంత్రులే కాదు, స్వయంగా ముఖ్యమంత్రే లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇది కాంగ్రెస్ ను ఇరుకున పెడుతోంది. లెఫ్ట్ పార్టీలు ఈ అవినీతి ఆరోపణలనే అస్త్రాలుగా చేసుకున్నాయి. అయితే, కేరళలో బీజేపీ అంటే నామమాత్రపు పార్టీ. కనీసం ఓ వార్డులో కూడా గెలవని పార్టీ. కానీ గత కొంత కాలంగా పరిస్థితి మారింది. గత ఏడాది తిరువనంత పురం మున్పిపల్ కార్పొరేషన్లో బీజేపీ 34 డివిజన్లను గెల్చుకుంది. పాలక్కాడ్ మున్సిపాలిటీలో అతిపెద్ద పార్టీగా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరికొన్ని మున్సిపాలిటీల్లోనూ ఖాతా తెరిచింది. కాసరగోడ్, మరికొన్ని జిల్లాల్లో చాపకింద నీరులా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ బలం పుంజుకుంటోంది. గ్రామపంచాయతీల్లో 933 వార్డులను గెల్చుకుని ఉనికి చాటుకుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సీట్లలో ఖాతా తెరవాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందుకోసం కొన్ని చిన్నా చితకా పార్టీలతో కూటమి కట్టింది. ఇప్పుడు బీజేపీ చీల్చే ఓట్లు కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీస్తాయా లేక కామ్రేడ్ల విజయాన్ని ప్రభావితం చేస్తాయా అనేది అంతుపట్టడం లేదు. అందుకే, వామపక్షాలు కాంగ్రెస్ అవినీతి అంశంపైనే ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ ఓటర్లను కూడా ఆలోచింపచేస్తున్నాయి. ఈ ప్రయత్నం ఫలిస్తేనే మరోసారి గాడ్స్ ఓన్ కంట్రీలో ఎర్ర జెండా ఎగురుతుంది. అది జరుగుతందా లేదా వేచి చూద్దాం.