తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అంతా బిజీ అయిపోయిన సమయంలో హఠాత్తుగా బీజేపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది. దుబ్బాక అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సూరంపల్లి అనే గ్రామంలో ప్రచారం చేస్తూండగా గటాని రాజు అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో పొట్టలో పొడిచేందుకు ప్రయత్నించారు. మూడు అంగుళాల మేర కత్తి దిగబడినట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటే.. కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.
ప్రాణానికి ఏం ప్రమాదం లేదని చెప్పిన అక్కడి వైద్యులు.. ప్రాథమిక చికిత్స చేసి.. అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోదకు తరలించారు. సికింద్రాబాద్ యశోదాలో ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. గటాని రాజు ఓ యూట్యూబ్ చానల్ లో విలేకరిగా పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. దాడి జరిగిన వెంటనే రాజును బీఆర్ఎస్ కార్యకర్తలు చితక్కొట్టారు. పోలీసులు వచ్చి విడిపించి స్టేషన్ కు తరలించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యానికి ఇబ్బందేం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందేమో దర్యాప్తు చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభ్లల్లో పాల్గొంటున్న కేసీఆర్.. ఈ ఘటనపై మండిపడ్డారు.
నేరుగా ఎదుర్కోలేక కత్తిపోట్లకు దిగుతున్నారని .. మాకూ దొరకదా మొండికత్తి అని హెచ్చరించారు. ప్రభాకర్ పైదాడి ఘటన మనసు కలచి వేసిందన్నారు. ప్రజాసేవ చేస్తే దాడులు చేయడం ఏమిటని.. ఎన్నికలు ఎదుర్కొలేక కత్తిపోట్లకు దిగుతున్నారని అంటున్నారు. ఈ అంశంపై పోలీసులు ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. నిందితుడు ఎవరు.. ఏ ఉద్దేశంతో చేశాడన్నది బయటకు రాలేదు.