ఏదైనా ఓ చోట తప్పు జరిగిందని తేల్చాలంటే ఏం చేయాలి ? ముఖ్యంగా అవినీతి నిరోధక కేసులు పెట్టేటప్పుడు… ఆధారాలు సేకరించాలి. డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వచ్చాయో తేల్చాలి. ఆ వివరాల్ని కోర్టుకు సమర్పించాలి. కానీ ఏపీలో మాత్రం… ఏసీబీ కేసులు పెట్టాలంటే… ఏసీబీ వాళ్లకు కాదు సీఐడీ వాళ్లకు ఫిర్యాదులు వస్తాయి. వారు చకచకా ఓ కథ అల్లేస్తారు. అందులో వివరాలన్నీ సగం సగం ఉంటాయి..
అంటే తమకు కావాల్సిన వాటినే చెబుతారు.
జీవోలిచ్చిన వాళ్లు మంచోళ్లయితే ఇక కేసు ఎలా ?
అధికారులు లైసెన్స్ ఫీజుకు మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అదే తప్పు అని కేసు పెడతారు. కానీ ఎందుకు లైసెన్స్ ఫీజు మినహాయించారు అన్నది మాత్రం గోప్యంగా ఉంచుతారు. అలాగే నిందితుల్ని కూడా ప్రతిపాదనలు పంపిన వారిని నిందితుల్ని చేస్తారు.. అన్నీ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చిన వారికి ఏ సంబంధం లేదని కేసులో ఇన్వాల్వ్ చేయరు. సాంకేతికంగా అసలు సంబంధం ఉండని మంత్రి, ముఖ్యమంత్రుల్ని మాత్రం బాధ్యుల్ని చేస్తారు. ఇంత ఘోరమైన చట్టవ్యతిరేక కేసులు, విచారణ ఏపీలోనే జరుగుతుంది. ఇదేంటి వ్యవస్థలో ఇలా కూడా జరుగుతుందా.. సెలక్టివ్ గా నిందితులు ఎందుకు ఉన్నారు… కీలకమైన బాధ్యతల్లో ఉన్న వారు.. సంతకాలు పెట్టిన వారు… ఆదేశాలు జారీ చేసిన వారు ఎందుకు తప్పు చేయలేదు అనే డౌట్ .. విచారణ వ్యవస్థల్లోనూ రాదు.
ఒక్క రూపాయి మనీ ట్రయల్ చూపించకుండా ఏసీబీ కేసులేంటి ?
ఇక్కడదే మ్యాజిక్. స్కిల్ కేసులో పెద్ద స్కాం అన్నారు కానీ.. నిర్ణయాలు మొత్తం తీసుకుని జీవోలు జారీ చేసి.. డబ్బులు రిలీజ్ చేసిన రెడ్ల పేర్లు లేవు. అసలు స్కామంటూ జరిగితే వాళ్లే నిందితులు. నేరుగా ముఖ్యమంత్రిని ఎలా టార్గెట్ చేస్తారన్న డౌట్ న్యాయస్థానాలకు రాలేదు. పోనీ ఆయనకు ఏమైనా డబ్బులు అందినట్లుగా ఆధారాలు ఉన్నాయా అంటే.. నీళ్లు నములుతున్నారు. మరి సెలక్టివ్ నిందితులపైనా కేసులు ఎలా పెట్టారని సీఐడీని నిలదీయాల్సిన వ్యవస్థలుకూడా సైలెంట్ గానే ఉంటున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఎక్సైజ్ కేసు. మద్యం పేరుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేసిన ప్రభుత్వం… అప్పట్లో అక్రమాలంటూ.. ఇప్పుడు కేసులు పెట్టింది. అందులోనూ జీవోలిచ్చిన కల్లం అజేయరెడ్డి పేరు లేదు. తప్పంటూ జరిగితే ముందు ఆయనను కదా బొక్కలోకి తోయాల్సింది. కనీసం పేరు కూడా పెట్టలేదు.
రాజకీయ కుట్రల్లో ప్రైవేటు ముఠాగా మారిన సీఐడీ లాంటి వ్యవస్థలు !
రాజకీయంగా .. ప్రత్యర్థుల్ని వేధించడానికి.. ఎన్నికల సన్నాహాల్ని దెబ్బతీయడానికి , ఆరోగ్య పరంగా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించి చంపడానికి కుట్రలు చేస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనికి వ్యవస్థలు సహకరిస్తున్నాయి. అసలు సీఐడీ పెట్టే కేసుల్లో అరెస్టులు తప్ప… చార్జిషీట్లు దాఖలు చేయడం లేదు. సోషల్ మీడియా పోస్టుల కేసుల దగ్గర్నుంచి చంద్రబాబుపై అరెస్టులు చేయడం వరకూ మొత్తం సీఐడీనే ఓ ప్రైవేటు సైన్యంగా వ్యవహరిస్తోంది. ఇలాంటివ్యవస్థలు ఉన్నది ప్రజల్ని కాపాడటానికి . కానీ ఇలాంటి దురాగతాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు కుట్రలు చేస్తున్న వారితోనే చేతులు కలుపుతున్నట పరిస్థితులు రాష్ట్ర ప్రజల్ని నివ్వెర పరుస్తున్నాయి.