వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా పెద్దగా ఫరక్ పడదని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం మానేశాయి. షర్మిల మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి సైలెంట్ గా ఉన్నారు. పోటీ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కానీ… వచ్చిన వాళ్లంతా ఏదో ఆశిస్తున్నారు. ఎంతో కొంత పార్టీ ఫండ్ ఇస్తారని అనుకుంటున్నారు కనీసం ప్రచార సామాగ్రి కూడా ఇచ్చే పరిస్థితి లేదని తేలడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
మరో వైపు షర్మిల నాలుగో తేదీన పాలేరులో నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచే అక్కడ ప్రచారం చేస్తారు. మొదటి నుంచి షర్మిలకోసం పని చేస్తున్న పిట్టరాంరెడ్డి అనే నేత కొద్ది రోజుల కిందట పాలేరులో బూత్ స్థాయి కార్యకర్తల పేరిట సమావేశం ఏర్పాటు చేస్తే.. ఓ నలభై మందిని సమీకరించగలిగారు. దాంతో షర్మిల పార్టీ ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉందో వారికి అర్థమైది. అయితే ఇప్పుడు వెనక్కి తగ్గడం కష్టం కనుక.. షర్మిల అక్కడ పోటీ చేయడానికే సిద్ధమయ్యారు. అభ్యర్థులు లేకపోవడం వల్ల.. జాబితాల ప్రస్తావన రావడం లేదు.
కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డవారు తమ పార్టీ వైపు వస్తారని వేచి చూస్తున్నారు. అలాంటి వారు బీజేపీలోకే వెళ్లడం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం లేదు. ఎలా చూసినా తెలంగాణలో షర్మిల వేసిన తప్పటడుగుల కారణంగా ఆమె పార్టీ ఘోరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. షర్మిల కనీసం డిపాజిట్ తెచ్చుకున్నా గొప్పేనన్న వాదన వినిపిస్తోది.