దేశంలో ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకోవాలంటే … పార్టీలను వదిలేసుకుని పారిపోవడం లేదా… జైలుకెళ్లడం చేయాల్సిందే. దేశంలో అత్యంత అవినీతి పరుల్ని పెంచి పోషిస్తూ… తమ రక్షణ చక్రం కింద హాయిగా దందాలను చేసుకోనిస్తున్న కేంద్రం… ప్రాంతీయ పార్టీలను మాత్రం వదిలి పెట్టడం లేదు. తమకు అడ్డం వస్తారు అనుకున్న వారిని జైళ్లకు పంపడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైనా కన్ను పడింది.
సుప్రీంకోర్టు 338 కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ ఆధారాలిచ్చిందని చెప్పి మనీష్ సిసోడియా బెయిల్ తిరస్కరించిన తర్వాత గంటల వ్యవధిలోనే ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది. సిసోడియాకు వ్యక్తిగతంగా డబ్బులు అందాయని ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులతో.. ఆయనను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అదే జరిగితే.. ఢిల్లీలో ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. గతంలో ఓ సారి సీబీఐ కేజ్రీవాల్ ను ప్రశ్నించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ టార్టెట్ గా చాలా కాలంగా నుంచి దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయి. పంజాబ్ లో ఆప్ గెలుపు తర్వాత దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు కేజ్రీవాల్ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే సౌత్ లాబీ నుంచి చాలా మందిని అప్రూవర్లుగా మార్చారు. ఇదంతా కేజ్రీవాల్ టార్గెట్ గానే నడిచిందని చెబుతున్నారు. ఇప్పుుడు ఎన్నికలకు ముందు ఇంకా చాలా మంది ప్రాంతీయ పార్టీల నేతలు… అదీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారు… బీజేపీ మిత్రులకు వ్యతిరేకంగా ఉన్న వారు జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.