బేసిగ్గా సినిమాలు ఆగడానికి కారణాలు.. నిర్మాత కుదరక.. హీరోకి కథ నచ్చక, దర్శకుడు చెప్పినట్లు తీయక.. ఇలా వుంటాయి. కానీ దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పిన ఒక కండీషన్ మాత్రం ఆయన సినిమాలానే చాలా వెరైటీగా వుంది. వెంకటేష్, తరుణ్ భాస్కర్ కలయికలో ఓ సినిమా వస్తుందని ఎప్పుడెప్పుడో ప్రచారం జరిగింది. సురేష్ బాబు నిర్మాణంలో అంతా సెట్ అనుకున్నారు. కానీ సినిమా ఆగిపోయింది. దీనికి కారణం నిర్మాతో, హీరోనో కాదు.. స్వయంగా దర్శకుడు తరుణ్ భాస్కర్.
ఈ విషయాన్ని స్వయంగా తరుణ్ భాస్కర్ చెప్పారు. ”వెంకటేష్ గారితో ఒక సినిమా అనుకున్నాం. సురేష్ బాబు గారికి కథ ఒప్పించడం అంత తేలిక కాదు. ఐతే నేను చెప్పిన కథకు ఆయన అంగీకారం దొరికింది. ప్రొసీడ్ అవ్వమన్నారు. కానీ నాకే సెకండ్ హాఫ్ లో గురి కుదరలేదు. నాకు ఇంకా రైటింగ్ వర్క్ చేయాలనిపించింది. అందుకే ఆ సినిమా ఆగింది. ఇప్పుడు రైటింగ్ పని పూర్తయింది. నేను సిద్ధంగా వున్నాను. వెంకటేష్ గారితో తప్పకుండా సినిమా వుంటుంది” అని చెప్పుకొచ్చాడు తరుణ్. ఆయన డైరెక్ట్ చేసిన ‘కీడాకోలా’ నవంబర్ 3న విడుదల కానుంది.