కేసీఆర్ ప్రవేశ పెట్టిన బంధు పథకాలు ఇప్పుడు బీఆర్ఎస్కు సమస్యగా మారాయి. రైతు బంధు ఇస్తారో లేదో స్పష్టత లేదు. అదే సమయంలో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో ప్రవేశ పెట్టిన పథకాల్లో లబ్దిదారులు వందల్లో ఉంటే.. ఆశావహులు లక్షల్లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను నిలదీస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలు ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బందులోకి నెట్టేస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో ఓట్లు గుమ్మరిస్తాయనుకున్న ఆయా పథకాలు తమకు ఫలితాలను తెచ్చిపెట్టకపోగా.. ప్రతిబంధకాలుగా మారుతున్నాయంటున్నారు క్షేత్రస్థాయిలోని లీడర్లు. దళిత బంధు పథకం అమలైన గ్రామాల్లో లబ్దిదారులు పది మందో, పదిహేను మందో ఉంటే… లబ్దిపొందని వారు వందల్లో ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బీసీ, మైనారిటీ బంధు పథకాల పరిస్థితీ అదే. వాటికోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు.
ఇప్పుడు ఓటు అడిగేందుకు వెళ్లిన వారికి…. మీకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే స్కీములను ఇచ్చారని మాకెందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినా బాగుండేదని కొంత మంది వాపోతున్నారు. ఈ అసంతృప్తి పెరిగితే.. మొదటికే మోసం వస్తుందని .. బీఆర్ఎస్ నేతలుకంగారు పడుతున్నారు.