ఈమధ్య కాలంలో ఒక చిత్రానికి ఇద్దరు దర్శకులు పని చేయడం తరచుగా వినిపిస్తోంది. తీసిన సన్నివేశాల్లో క్యాలిటీ, కంటెంట్ నచ్చక మళ్ళీ వేరే దర్శకుడితో సన్నివేశాలు తీయిస్తున్నారు. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకే ఇలానే జరిగింది. సినిమా తీస్తున్న విధానం నచ్చక ఏకంగా దర్శకుడినే మార్చి ఆ స్థానంలో స్వయంగా దర్శకుడిగా మారాడు నిర్మాత అభిషేక్ నామా. అలాగే దర్శకుడు శంకర్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలని వేరే దర్శకుడితో తీయించారని వినిపించింది. ఆమధ్య ‘శాకిని డాకిని’ అనే సినిమాకి సుదీర్ వర్మ మొదట దర్శకుడిగా పని చేశాడు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చెబితే ఏకంగా ఆ ప్రాజెక్ట్ నే వదిలేశాడు. మిగిలిన సీన్స్ ని వేరే దర్శకులతో తీయించారు.
ఇప్పుడు ఆదికేశవ సినిమాకి అలానే జరిగిందని తెలిసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రమిది. శ్రీలీల హీరోయిన్. శ్రీకాంత్ దర్శకత్వం వహించాడు. నాగవంశీ నిర్మాత. ఈ సినిమా అవుట్ పుట్ చూసుకున్న నిర్మాతలకు కొన్ని సన్నివేశాలు తృప్తిగా అనిపించలేదు. దీంతో దర్శకుడు సుధీర్ వర్మతో కొన్ని సన్నివేశాలు తీయించారని తెలిసింది. అయితే డైరెక్టర్ క్రిడెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సుధీర్ పేరుని స్పెషల్ థాంక్స్ కార్డ్ వేస్తారని, దర్శకుడిగా శ్రీకాంత్ సోలో పేరే ఉండేలా చూస్తారని తెలుస్తోంది. ఈనెల10న సినిమా విడుదలౌతుంది.