మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కేంద్ర మంత్రుల్ని కూడా అసెంబ్లీ బరిలోకి దింపిన బీజేపీ హైకమాండ్ .. తెలంగాణకు వచ్చేసరికి.. కిషన్ రెడ్డినే కాదు.. డీకే అరుణ, విశ్వేశ్వర్ రెడ్డి వంటి వాళ్లను కూడా బరిలోకి దింపలేకపోయింది. సీనియర్ నేతలంతా మేము పోటీ చేసేది లేదని తేల్చి చెప్పేశారు. కాదని టిక్కెట్ ఇస్తే.. ఉపయోగం ఉండదని చెప్పడంతో ఇతర నేతల్ని చూసుకుంటున్నారు. గద్వాల నుంచి ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన రికార్డు ఉన్న డీకే అరుణ తాను పోటీ చేయనని చెప్పేశారు. పోనీ కుమార్తెకు సీటిస్తామంటే.. అలా కూడా వద్దన్నారు.
బీసీ అభ్యర్థికి ఇస్తే పని చేస్తానని చెప్పారు. మరో సీనియర్ నేత జితేందర్ రెడ్డిని పోటీ చేయమంటే.. తన కుమారుడకి బీఫాం తీసుకున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎక్కడో చోట పోటీ చేయాలని కోరినా అసెంబ్లీ బరిలోకి దిగేది లేదన్నారు. ఇక తాను రాజ్యసభ సభ్యుడినని లక్ష్మణ్ ముందే తప్పించుకున్నారు. నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి రావడంతో వెళ్లిపోయారు. మల్కాజిగిరి నుంచి రామచంద్రరావు పోటీ చేసేది లేదంటున్నారు. ఉప్పల్ లో ఎన్వీవీఎస్ ప్రభాకర్ కూడా అదే చెబుతున్నరు. టీడీపీ మద్దతు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోతే పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిసినా కిషన్ రెడ్డి చేయబోవడం లేదన్నారు. పోనీ ఆయన భార్యనైనా నిలబెడతారా అంటే.. అలా కూడదన్నారు.
బీజేపీలో సీనియర్లు అందరూ పోటీకి దూరంగా ఉండటం వల్ల.. ఆ పార్టీ ఇప్పటికే చేతులెత్తేసిందన్న ప్రచారం రాజకీయవర్గాలు చేస్తున్నాయి. గెలుపుపై నమ్మకం ఉంటే సీనియర్లు టిక్కెట్ల కోసం పోటీ పడేవారని.. పోటీ చేసేది లేదని ఒకరి తర్వాత ఒకరు ఎందుకు వైదొలుగుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నారు. ఇది నిజమే అయినా బీజేపీ హైకమండ్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి.