ఆంధ్రాలో వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా చేర్చుకొని ప్రతిపక్షాలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తుంటే, తెలంగాణాలో తెదేపా ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకొంటూ తెదేపాను బలహీనపరుస్తోంది తెరాస. ఇప్పటికే తెదేపాకు చెందిన 10మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోయారు. నిన్న మరో ఎమ్మెల్యే ప్రకాశ గౌడ్ కూడా తెరాసలో చేరిపోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరిపోయారు. ఆయనతో బాటు ఆయన అనుచరులు కూడా తెరాసలో చేరిపోయారు. మైలార్ దేవ్ పల్లిలో జరిగిన ఒక బహిరంగ సభలో వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణాలో తెదేపాకి ఉన్న 15మంది ఎమ్మెల్యేలలో 11మంది తెరాసలోకి వెళ్ళిపోయారు కనుక ఇంకా తెలంగాణాలో తెదేపా మనుగడ కష్టమే అవుతుంది.