టిక్కెట్లు ప్రకటించినప్పటికీ .. ఎప్పటికప్పుడు అభ్యర్థుల బలాబలాను పరిశీలిస్తూ.. వారి పని తీరును అంచనా వేస్తూ… బీఫాంను ఆపేయాలని .. కొత్త అభ్యర్థులకు చాన్సివ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో సీనియర్లనూ వదిలి పెట్టడం లేదు. వనపర్తి అభ్యర్థి జి. చిన్నారెడ్డి బీఫాం ఆపే శారు. తనది సీఎం స్థాయి అని ఆయన చెప్పుకుంటున్నారు కానీ.. ప్రజల్లో పలుకుబడి పూర్తిగా కోల్పోయారని.. యువనేతకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన బీఫాం ఆపేశారు.
చేవెళ్ల అభ్యర్థి భీంభరత్, బోధ్ అభ్యర్థి వన్నెల అశోక్‌లకు బీఫామ్‌లు ఆపేయాలని అధిష్టానం ఆదేశించింది. వీరు టిక్కెట్ ప్రకటించిన తరవాత కూడా ఏ మాత్రం వ్యూహం లేకుండా ఉన్నారని… ప్రత్యర్థికి విజయాన్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారని క్లారిటీ రావడంతో అక్కడ టిక్కెట్ కోసం పోటీ పడిన ఇతర నేతలకు అవకాశం కల్పించనున్నారు. కాంగ్రెస్ మూడో జాబితా సోమవారం వచ్చే అవకాశం ఉంది. అందులో ఈ మార్పులు ఉండనున్నాయి. రేవంత్ రెడ్డిని ఈ సారి రెండు చోట్ల పోటీ చేయమని హైకమాండ్ ఆదేశించింది. రేవంత్ రెడ్డి.. కామారెడ్డిలో నామినేషన్ వేయబోతున్నారు.
కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్.. ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పనులు చక్క బెడుతున్నారు. చేరికలను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పార్టీలో చేరారు. గెలుపు ముంగిట ఉన్నామని ఎలాంటి తప్పులు జరగకుండా.. చూసుకుంటే.. లక్ష్యాన్ని అందుకుంటామని భావిస్తున్నారు. అందుకే బీఫాంలు కొంత మందికి పెండింగ్ పెట్టడానికి కూడా సిద్ధమయ్యారని చెబుతున్నారు.