టెక్నాలజీ పెరిగిపోయిందని ఆనందించాలో, దాని వల్ల పెరుగుతున్న ఇబ్బందులు చూసి బాధ పడాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)తో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ట్రిక్కు ఉపయోగించి మార్ఫింగ్ ఫొటోల్ని, వీడియోల్ని సృష్టించడం మరింత సులభం అయిపోయింది. ఈమధ్య కథానాయికల అర్థనగ్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అవి ఒరిజినలా? మార్పింగా ? అనేది కూడా తేల్చుకోలేకపోతున్నాం. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే సాయి పల్లవి లాంటి కథానాయికలు సైతం… ఎక్స్పోజింగ్ చేస్తూ దర్శకమివ్వడం ఈ కళాకృతుల ప్రత్యేకత. ఈమధ్య రష్మిక హాట్ వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అందులో రష్మిక మరింత ఎక్స్పోజింగ్ చేస్తూ కనిపించింది. రష్మిక ఏంటి మరీ…. ఇలా ఓవర్ చేస్తోంది అని ఆశ్చర్యపోయారంతా.
నిజానికి అది ఒరిజినల్ వీడియో కాదు. అచ్చంగా మార్ఫింగ్ చేసిందే. రష్మిక ఫొటోల్ని సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించి సోషల్ మీడియాలో వదలుతున్నారు. అవి కూడా వైరల్ అయ్యాయి. రష్మిక, సాయి పల్లవి అనే కాదు. దాదాపుగా ప్రతీ హీరోయిన్ ఫొటో.. ఇలానే మార్ఫింగ్ చేసి వదులుతున్నారు. కొన్నాళ్లకు మార్పింగ్ వీడియోలు, ఫొటోలే అసలు ఫొటోలుగా చలామణీ అయ్యే ప్రమాదం కూడా రావొచ్చు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో…. కథానాయికలకు అర్థం కావడం లేదు. లీగల్ గా ఇలాంటి పోస్టులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కాక… పోలీసు వ్యవస్థ కూడా చేతులెత్తేస్తోంది.
మార్ఫింగ్ అనేది ఇప్పుడే పుట్టుకొచ్చిన తెగులు కాదు. ఇది వరకూ ఉంది. అయితే అప్పట్లో మార్ఫింగ్ కీ, ఒరిజినల్ కీ క్లియర్ గా తేడాలు తెలిసేవి. ఇప్పుడు అలా లేదు. దాంతో… మార్ఫింగ్ అన్నా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే కథానాయికలకు మరింత తలనొప్పులు ఎక్కువయ్యాయి. ప్రతీసారీ మీడియా ముందుకొచ్చి, అవి ఒరిజినల్ కాదు.. అని చెప్పుకోలేరు కదా. మరి…ఈ సమస్యకు పరిష్కారమేంటో?