ప్రధాని మోదీ తన అన్న, పెద్దన్న అని పవన్ కల్యాణ్ అన్నారు. బీసీ ఆత్మగౌరవసభపేరుతో హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభకు ప్రధానితో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్ది సేపు ప్రసంగించిన పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీని ప్రశంసించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ధాని మోదీ ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ లాంటివి కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదని అన్నారు.
దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయి కానీ, ఎన్నికల ప్రయోజనాలు కాదని అన్నారు. ‘‘భాగవతం పుట్టిన నేల ఇది. ఈ నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోదీ నాయకత్వంలో బీసీలు తెలంగాణలో ఎదగాలి. బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దీనికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుంది. విజన్ 2047 లో భాగంగా ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశం కావాలంటే.. మూడోసారి మోదీ సర్కార్ రావాలి. ఈ ఎన్నికల కోసం ప్రధాన మంత్రికి నేను అండగా ఉంటాను. తమ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్ కు ధన్యవాదాలు’’ అని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. .ఐదు సంవత్సరాలకు ఓ సారి ఎన్నికలు ఉండాలి తప్ప, ఐదేళ్ల పాటు ఎన్నికలు జరగడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాకే ఉగ్రదాడులు నియంత్రించగలిగారని అన్నారు.
దేశంలో ఉన్న అత్యధిక జనాభా బీసీలు. మోదీ ప్రభుత్వం బీసీలను నోటితో చెప్పి ప్రేమించలేదని, సీటుతో ఇచ్చి ప్రేమించిందని అన్నారు. మాటలతో కాకుండా, బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిందన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేనూ మీలా సామాన్యుడిలాగే ఆయన ప్రసంగాలు వినేవాడిని. ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే బాగుంటుందని అనుకునేవాడిని. మోదీ నాకెంతో ఇష్టమైన నాయకుడని..ఇలాంటి వ్యక్తి పక్కన కూర్చునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నారు.