వరల్డ్ కప్ లో ఓ అద్భుతం నమోదైయింది. ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు.. అందులోని ఆటగాళ్ళు ఎంత ప్రమాదకరమో మరోసారి చాటి చెప్పారు. వన్డే ప్రపంచకప్ లో భాగంగా ముంబై వాంఖడే మైదానంలో అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసిస్ ఆటగాడు మాక్స్వెల్ విధ్వంసం సృష్టించాడు. విధ్వంసం అనడం కంటే అద్భుతం అనడం సబబు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అఫ్గాన్ 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129*) సెంచరీ సాధించి అలరించాడు. వరల్డ్ కప్ లో తొలి సెంచరీ చేసిన అఫ్గాన్ బ్యాటర్ గా నిలిచాడు.
292 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ కు ఆఫ్గాన్ బౌలర్లు షాక్ ఇచ్చాడు. యాబై పరుగులకే టాప్ ఆర్డర్ అంతా కూల్చేశారు. 91 పరుగులకే ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదులుకుంది. ఈ దశలో క్రీజ్ లో వున్న ఏకైక బ్యాటర్ మ్యాక్స్ వెల్. అయితే ఈ ఒక్క బ్యాటరే.. ఓ చారిత్రాత్మక ఇన్నింగ్ ఆడాడు. ప్యాట్ కమిన్స్ ని మరో ఎండ్ లో వుంచి.. తనే ఎక్కువ స్ట్రయిక్ తీసుకుంటూ.. ఏకంగా ఒంటి చెత్తో డబుల్ సెంచరీ చేసి ఓ అద్భుతమైన విజయాన్ని టీంకి అందించాడు.
మ్యాక్స్ వెల్ ఇన్నింగ్ లో 21 ఫోర్లు, 10 సిక్సులు వున్నాయి. కేవలం 128 బంతుల్లో 201 పరుగులు బాదేశాడు. ఒక దశలో అతని శరీరం సహకరించలేదు. క్రాంప్స్ పట్టేశాయి. ఒక కాలు పని చేయలేదు. కేవలం ఒంటి కాలుతో కుంటుకొని బౌండరీలే కొడుతూ.. ఒక అద్భుతం లాంటి ఇన్నింగ్ ఆడాడు. వరల్డ్ కప్ లోనే కాదు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మ్యాక్ వెల్ ఆడిన ఇన్నింగ్ ఎప్పటికీ నిలిచిపోతుంది.