తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎనిమిది సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులు లేకపోయినా ఆ పార్టీ పోటీ చేయాలనుకుంది 32 స్థానాల్లోనే కాబట్టి ఈ ఎనిమిది సీట్లు జనసేనకు కేటాయించడం సముచితమేనని బీజేపీ భావించి ఉంటుంది. పదకొండు సీట్లకు అంగీకరించినట్లుగా ప్రచారం జరిగింది. మిగిలిన సీట్లు ఇస్తారో లేదో క్లారిటీ లేదు. కానీ ఇచ్చిన సీట్లలో జనసేన పార్టీ ప్రభావం చూపించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది.
తొలి సారి పోటీ చేస్తున్న జనసేన – బలమైన ముద్ర వేయాల్సిందే
బీజేపీ ఇచ్చిన సీట్లలో గ్రేటర్ పరిధిలో ఒక్క కూకట్ పల్లి మాత్రమే ఉంది. ఆ సీటు కూడా బీజేపీ నుంచి వచ్చిన నేతకు కేటాయించారు. ఎవరికి కేటాయించారన్న సంగతి పక్కన పెడితే… కూకట్ పల్లిలో గెలిచి తీరాల్సిన పరిస్థితి జనసేనకు ఉంది. అలాగే ఖమ్మం వంటి చోట్ల తనదైన మార్క్ చూపించాల్సి ఉంటుంది. ఇక తమ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ పోటీ చేస్తున్న తాండూరులో నూ గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
తేడా వస్తే జనసేనతో పెట్టుకుని నష్టపోయామని బీజేపీ నిందలేసే చాన్స్
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఉన్న పరిస్థితికి… ఆ పార్టీ వైపు నుంచి పేలిపోయేంత సహకారం వస్తుందని అనుకకోలేరు కానీ పరస్పర సమన్వయంతో మెరుగైన ఫ లితాలు సాధించడానికి మాత్రం ప్రయత్నించాల్సి ఉంటుంది. కనీసం ఒకటి లేదా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలిస్తే జనసేన పార్టీ తమ పంతాన్ని నిలుపుకున్నట్లు అవుతుంది. అది ఏపీ ఎన్నికల్లో హెల్ప్ అవుతుంది. బీజేపీతో పొత్తు ఉండి కూడా జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతే అది ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్‌కు నైతికపరమైన దెబ్బ అవుతుంది. అదే సమయంలో బీజేపీ కూడా పవన్ తో పెట్టుకుని నష్టపోయామని నిందలేసే అవకాశం ఉంది. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ ఎవరు అడిగిన నేతలు అక్కడున్నారు మరి !
టీడీపీ సానుభూతిపరుల మద్దతు లభిస్తుందా ?
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల నుంచి విరమించుకుంది. తమ దృష్టి పూర్తిగా ఏపీపైనే ఉందని చెప్పింది. కాబట్టి టీడీపీ జనసేన ఉన్నందున ఆ కూటమికి ఓటు వేయమని అడిగే అవకాశం లేదు. టీడీపీ సానుభూతిపరులకు ప్రత్యేకమైన సందేశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. తమకే మద్దతివ్వాలని బీజేపీ, పవన్ కూడా అడగలేరు. ఎలా చూసినా పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికలతో పొలిటికల్ గా క్లిష్టమైన గేమ్ ఆడుతున్నారు. ఎంత బలం చూపిస్తే… ఆయన రాజకీయం అంత బలంగా ఉంటుంది.