జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ జనవరి 6న మరణించారు. ఆయన స్థానంలో ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ పిడిపి పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎంపికయ్యారు కూడా. అంతవరకు పిడిపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆమె ముఖ్యమంత్రి కావడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అయినా ఆమె ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు రాకపోవడంతో అప్పటి నుండి నేటికీ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోంది.
రెండు పార్టీల మధ్య మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ హయంలో జరిగిన అన్ని ఒప్పందాలను యధాతధంగా అమలుచేయాలని మహబూబా ముఫ్తీ డిమాండ్ చేస్తున్నారు. అందుకు కూడా బీజేపీ అంగీకరించింది అయినా ఆమె ఆ ఒప్పందంలో కొన్ని అంశాలపై మోడీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదంటూ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. గత రెండు నెలలుగా ఆ రెండు పార్టీల మధ్య తెర వెనుక చర్చలు సాగుతూనే ఉన్నాయి అయినా వాటి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఆ ఒప్పందంలో పేర్కొన్న అంశాలు ఏమిటో ఆ రెండు పార్టీలు కూడా బయటపెట్టకపోవడంతో అవేమిటో వాటికి తప్ప ఇతరులకి తెలిసే అవకాశం లేదు. ఆమె తీరుతో విసుగేట్టిపోయిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి ఆరాటం పడటం మానేసి ఆమె అంతట ఆమె దిగివచ్చే వరకు తాపీగా కూర్చొని చూస్తోంది.
సమయం గడుస్తున్న కొద్దీ ఆమెపై కూడా పార్టీ ఎమ్మెల్యేల నుండి ఒత్తిడి పెరిగిపోయినట్లుంది. అందుకే ఆమె నిన్న జమ్మూలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తానేమీ భయపడటం లేదని చెప్పారు. “రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలుగకపోతే, ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రయోజనం ఉండదు. కనుక ఒకవేళ నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనే అందరూ భావించవచ్చును. నా తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ బీజేపీతో కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా చేతులు కలపలేదు. ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే వారి ప్రతినిధిగా కేంద్రప్రభుత్వంతో చేతులు కలిపారు. కనుక నేను కూడా అయన నడిచిన దారిలోనే నడవాలనుకొంటున్నాను. బీజేపీతో చేతులు కలుపుతునందుకు కొందరు ప్రజలు నన్ను మేచ్చుకోవచ్చును లేదా అసహ్యించుకోవచ్చును. కానీ నేను భయపడి వెనకడుగువేయబోను. కానీ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. లేకుంటే దానితో కలిసి పనిచేయలేను,” అని చెప్పారు.
ఆమె నిన్న రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం ఆమె మళ్ళీ తన పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయిన తరువాత దీనిపై అధికారికంగా ప్రకటన చేయవచ్చును. బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటికి సిద్దంగానే ఉంది కనుక వచ్చే వారంలో ఎప్పుడయినా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మహబూబా ముఫ్తీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి.