దాదాపు 900 చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు చేసిన చంద్రమోహన్ కి ఒక్కటంటే ఒక్క అవార్డు రాలేదు. ఆయన అవార్డుకి అనర్హుడా..? అంటే కాదాయె. ఎలాంటి పాత్ర చేసినా మెప్పించడం, దానిపై తనదైన ముద్ర వేయడం చంద్రమోహన్ కి అలవాటే. కానీ పద్మశ్రీలూ, డాక్టరేట్లూ దక్కలేదు. వాటిపై చంద్రమోహన్ కి కూడా సదాభిప్రాయం లేదు. అర్హులైన వాళ్లకు అవార్డులు ఇవ్వనప్పుడే.. వాటిపై నాకు గౌరవం పోయింది అనేవారాయన. ఎస్వీఆర్, కైకాల, సావిత్రి, సూరేకాంతం.. ఇలాంటి వాళ్లకు అవార్డులు ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చినా… వాటికి వాల్యూ ఉండదని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. బ్రహ్మానందంకి పద్మశ్రీ ఇచ్చినప్పుడు సైతం తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ”ఇటీవల ఓ హాస్యనటుడికి పద్మశ్రీ ఇచ్చారు. ఆయన వెయ్యి సినిమాలు చేస్తే అందులో రెండొందల సార్లు పురోహితుడిగానే కనిపించారు. చేసిన పాత్ర చేయడం వల్ల వైవిధ్యం ఎందుకు వస్తుంది” అన్నది చంద్రమోహన్ అభిప్రాయం.
నటీనటులకు డాక్టరేట్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నది చంద్రమోహన్ ప్రశ్న. ఏళ్ల పాటు కష్టపడితే కానీ రాని డాక్టరేట్… స్టార్ హీరోలకో, హీరోయిన్లకో ఇచ్చేస్తే దానికి విలువ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. అంతేకాదు.. పది, పాతిక వేలకు డాక్టరేట్ దొరికేస్తోందని, అలాంటప్పుడు డాక్టర్ అంటూ పేరు ముందు తగిలించుకోవడం వల్ల ఉపయోగం లేదని చెప్పేవారాయన. ”నేను ఇండస్ట్రీకి చంద్రమోహన్ గానే వచ్చాను. చంద్రమోహన్ గానే వెళ్లిపోతాను. నా పేరు ముందు ఎలాంటి బిరుదులూ వద్దు.. గౌరవాలూ, అవార్డులూ వద్దు” అని చెబుతుండేవారు. అలానే కేవలం చంద్రమోహన్ గానే వచ్చారు, చంద్రమోహన్ గానే వెళ్లిపోయారు.