కూకట్పల్లిలో విజయం ఖాయమని ఆశలు పెట్టుకున్న జనసేన పార్టీకి ఇతర రాజకీయ ప్రత్యర్థు ట్రిక్కులు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. కూకట్ పల్లిలో నామినేషన్లు పూర్తయిన తర్వాత జాతీయ జనసేన అనే పార్టీ కూడా జాబితాలో కనిపించింది. ఇదెప్పుడు పెట్టారబ్బా అని అందరూ ఆశ్చర్యంగా చూసేలోపు .. ఆ పార్టీ గుర్తు బకెట్ గా తేలింది. జనసేన గుర్తు గాజు గ్లాస్.. ఆ గుర్తుకు సిమిలర్ గానే బకెట్ ఉంటుంది. దీంతో ఉద్దేశపూర్వకంగానే జనసేన ఓట్లకు గండికొట్టేందుకు ఈ ప్లాన్ ను ప్రత్యర్థులు చేశారని జనసేన వర్గాలు అనుమానిస్తున్నారు.
బీజేపీ మద్దతుతో జనసేన అభ్యర్థి ముమ్మడి ప్రేమ్ కుమార్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ బరిలో లేకపోవడంతో తమకు కలసి వస్తుందని జనసేన వర్గాలు ఆశపడుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన వేల మంది ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉంటారు. వీరందరిపై జనసేన ఎన్నో ఆశలు పెట్టుకుంది. పోటీ హోహారీగా జరిగే పరిస్థితుల్లో కొన్ని ఓట్లకు గండి పడినా పరిస్థితి క్లిష్టంగా మారుతుందని జనసేన వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీదేనని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. బకెట్ గుర్తుతో అభ్యర్థి విస్తృత ప్రచారం కూడా చేసే అవకాశం ఉందని.. ఓట్ల చీలిక వ్యూహం కోసమే జాతీయ జనసేన పేరుతో అభ్యర్థిని నిలబెట్టారని అనుమానిస్తున్నారు. దీంతో గ్లాస్ గుర్తుపై జనసేన మరింత దూకుడుగా ప్రచారం చేయాలని అనుకుంటోంది.