వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి.. తెలంగాణలో సీఎం అవుతానని చాలెంజ్ చేసిన షర్మిల చివరికి అవమానాలే ఎదురవుతున్నాయి. తాజాగా గట్టు రామచంద్రరావు నేతృత్వంలో ఉన్నారో లేదో తెలియని నేతలంతా కట్ట కట్టుకుని బీఆర్ఎస్ లో చేరిపోయారు. గట్టు రామచంద్రరావు తప్ప మిగతా వారు ఎవరో ఎవరికీ తెలియకపోయినా స్వయంగా హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వైఎస్ఆర్టీడీపీని బీఆర్ఎస్ లో విలీనం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. షర్మిల ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత దాదాపుగా ఆ పార్టీ ఉన్న నేతలంతా.. ఆమెపై తిరుగుబాటు చేశారు.
నిజానికి ఆ పార్టీలో నేతలంతా ఎవరికీ తెలియని వాళ్లే. ఒక్క గట్టు రామచంద్రరావు మాత్రం గతంలో వైసీపీలో చేశారు. ఆయన కూడా తర్వాత ఎక్కడా కనిపించలేదు. చివరికి పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన తర్వాత మాత్రమే ఆయన తెరపైకి వచ్చారు. రాజీనామా చేసి షర్మిలపై ఘాటు విమర్శలు చేశారు. మరో వైపు వ్రతం చెడినా ఫలితం కూడా దక్కలేదన్నట్లుగా షర్మిల పరిస్థితి మారింది. కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుంచి విరమించుకుంటే.. పట్టించుకున్న వారులేరు.
కనీసం కృతజ్ఞతలు కూడా కాంగ్రెస్ వైపు నుంచి రాలేదు. ఇక ప్రచారానికి ఎక్కడ పిలుస్తారు…? ఇప్పుడు పార్టీని విలీనం చేసినట్లుగా ఆ పార్టీ నేతలు ప్రకటించడంతో షర్మిలకు మరిన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయని షర్మిల ఇక రాజకీయ జీవితం ముగిసినట్లేనని కొంత మంది విశ్లేషిస్తున్నారు.