తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని నిలిపివేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్న వైనం ఆ పార్టీపై నెగెటివ్ ప్రచారానికి కారణం అవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రకటనలను.. వీడియోనూ టీవీల్లో నిషేధిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తమ దగ్గర తీసుకున్న అనుమతికి.,. చేసిన ప్రకటనలకు తేడా ఉందని ఈసీ చెప్పింది. తాజాగా రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనను ప్రచారం నుంచి నిషేధించాలని ఈసీకి బీఆర్ఎస్ లేఖ ఇచ్చింది.
రేవంత్ రెడ్డిని ప్రచారం చేయవద్దని బీఆర్ఎస్ అనడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్, కేటీఆర్ లే ఇంకా ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు. స్వయంగా నర్సంపేటలో కేసీఆర్ షర్మిల గురించి వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎన్నికల బరిలో లేదు. షర్మిల వచ్చి నర్సంపేటలో ఎమ్మెల్యేగా అనుచిత వ్యాఖ్యలు చేశారని… ఆమె డబ్బు పంచులు ఎమ్మెల్యేను ఓడించడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఆంధ్రా గురించి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా ఆయన ప్రచారాన్ని నిషేధించాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలాంటి ఫిర్యాదులు సహజమే కానీ.. సంచలనం సృష్టించే.. వివాదాస్పదమైన ప్రకటనలు చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నియంత్రించాలని కోరవచ్చు. కానీ రొటీన్ రాజకీయ విమర్శలు చేస్తున్నా అది రెచ్చగొట్టుడు అని చెప్పి ఫిర్యాదు చేయడంతో బీఆర్ఎస్ ఎంత ఆత్మరక్షణ ధోరణిలో ఉందో అర్థమవుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్లో ఫిర్యాదులు ఉండవచ్చు కానీ.. ఎదుటి వాళ్లని ఆపాలని.. వారు ప్రచారం చేయకుండా నియంత్రించాలని .. వారు ప్రచారం చేస్తే ఏదో జరిగిపోతుందని అనుకుంటే మైనస్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని వివిధ సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్ అంగీకరిస్తున్నారు. ఇాలాంటి సమయంలో… కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయవద్దని ఫిర్యాదులు చేయడం నెగెటివ్ గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.