ఏపీలో అంతటా కరువు ఏర్పడింది. ఇది కళ్ల ముందు కనిపించే నిజం. ఈ కరువు ప్రకృతి ప్రకోపం. దానికి ప్రభుత్వ వైఫల్యంతో సంబంధం ఉండదు. కానీ దాన్ని నుంచి రైతుల్ని ఆదుకోవడం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ సామర్త్యం మీద ఆధారపడి ఉంటుంది. పాలకుడుకి ఆ సామర్థ్యం లేకపోతే రైతులే నష్టపోతారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
కరువు ఏర్పడితే రైతుల్ని ఆదుకునేందుకు కరువు మండలాల్ని ప్రకటించి కేంద్రానికి సాంయ కోసం ప్రతిపాదనలు పంపారు. కేంద్ర కరువు మాన్యువల్ ప్రకారం కరువును ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసిన వారంలో కేంద్రాన్ని సహాయం కోరుతూ రాష్ట్ర సర్కారు సమగ్ర విజ్ఞాపన పత్రం సమర్పించాలి. కానీ కరువు మండలాల ప్రకటనపై నాన్చిన ప్రభుత్వం, డెడ్లైన్ చివరి రోజున ఆఖరి గడియల్లో గెజిట్ జారీ చేసింది. పది రోజులు గడిచినా నష్టం అంచనాలు, కావాల్సిన ఆర్థిక సహాయంపై కేంద్రానికి పంపాల్సిన విజ్ఞప్తి పంపలేకపోయారు.
ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో విపత్తు సహాయ నిధులివ్వాలో ఐదేళ్లకోసారి ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఇది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నిర్ణయించిన నిధుల్లో 90 శాతం కేంద్రానికి, 10 శాతం రాష్ట్రానివి ఉంటాయి. ప్రత్యేకంగా విపత్తులొచ్చినప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ నుంచి కేంద్రం రాష్ట్రాలకు నిధులిస్తుంది. ప్రత్యేక సాయం కోసం ఎన్డిఆర్ఎఫ్ నిధులు అడగాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించాలి. సాధారణంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు రాష్ట్రాలు కొంచెం ఎక్కువే నిధులడుగుతాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు అడగడానికే జంకుతున్నట్లు మొహమాటపడుతోంది. కరువు లేదని చెప్పుకునేందుకు తాపత్రాయ పడుతోంది.
రాష్ట్రంలో ఖరీఫ్ చివరాఖరుకు 300 పైగా మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉంది. అక్టోబర్లో, నవంబర్లో ఇప్పటి వరకు సరైన వానల్లేవు. లక్షల ఎకరాల్లో సాగు లేకపోగా, సాగు చేసిన లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. అయినా ప్రభుత్వం 80 తీవ్ర కరువు మండలాలనే ప్రకటించింది. కొంచెమే కరువు ఉందని జగన్ రెడ్డి చెప్పడంతో అధికారులు ఆ కొంచెన్నే చూపిస్తున్నారు. రైతుల్ని నట్టేట ముంచుతున్నారు.