” అభివృద్ధి చేసేవాళ్లు ఇంకొన్నాళ్లు అధికారంలో ఉంటే తప్పేంటని, బోర్ కొట్టిందని కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా” అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓ ఎన్నికల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. మేము బాగా పరిపాలించాం.. మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తాం ఓడగొట్టుకుంటే నేనేమీ చేయలేను అని కేసీఆర్… నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ రెండు కామెంట్లు ఒకే రోజుచేశారు. కాస్త పరిశీలిస్తే దాదాపుగా రోజూ ఇలాంటి కోణంలోనే కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ప్రచార సరళిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. దాన్ని మార్చాలన్న వ్యూహం కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో మౌత్ టాక్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మౌత్ టాక్ కాంగ్రెస్ వైపు ఉంది. ఈ సారికి కాంగ్రెస్ అనే నినాదం అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తూండటంతో బీఆర్ఎస్ పెద్దలు అప్రమత్తమయ్యారు. అనవసరంగా రిస్క్ తీసుకుని కాంగ్రెస్ ఓటు వేయవద్దని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రచార ప్రకటనల్లోనూ రిస్క్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికి బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణం ప్రజల్లో కాంగ్రెస్ పై సింపతీ పెరగడం.. ఆ పార్టీకి కూడా ఓ చాన్సివ్వాలన్న ఆలోచన రావడమేనని దీనని బీఆర్ఎస్ అగ్రనేతలు గుర్తించి.. విరుగుడు ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. అయితే వారు చేస్తున్న ప్రకటనలు.. .ముందే ఓటమిని అంగీకరించినట్లుగా ఉంటున్నాయని విప్కష నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే కేసీఆర్ రాజకీయాన్ని ఊహించడం కష్టం. ఆ మాటలు కాస్త వెనుకబడ్డామన్న అభిప్రాయాన్ని కల్పించినా… మేలు చేస్తాయని నమ్ముతున్నారని అంటున్నారు.