సూపర్ స్టార్ కృష్ణ స్మృతికి చిహ్నంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని కృష్ణ కుటుంబ సభ్యులు ఎప్పుడో భావించారు. పద్మాలయా స్టూడియోలో ఓ భవనాన్ని నిర్మించి, అందులో కృష్ణ జ్ఞాపకాల్ని పదిల పరచుకోవాలని అనుకొన్నారు. కానీ… అందుకు సంబంధించిన కార్యాచరణ ముందుకు సాగడం లేదు. మహేష్ బాబు కూడా దీనిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మహేష్ తలచుకొంటే… ఇది టక్కున జరిగిపోయే పనే. కానీ ఆయన అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి.
మ్యూజియం వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదని, దాని బదులుగా పేద విద్యార్థులకు సహాయం అందించడం గొప్ప పని అని మహేష్ భావిస్తున్నాడు. అందుకే సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో స్కాలర్ షిప్లు అందించబోతున్నాడు. తొలి విడతగా 40 మంది పేద విద్యార్థుల్ని ఎంపిక చేశారు. పాఠశాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ వాళ్ల చదువులకు సంబంధించిన ఖర్చుని ఈ ఎడ్యుకేషనల్ ఫండ్ అందిస్తుంది. యేడాదికి 40 మంది చప్పున ప్రతీ యేటా ఇలా స్కాలర్ షిప్లు అందించాలని మహేష్ భావిస్తున్నాడు.