బీజేపీకి విజయశాంతి గుడ్‌బై చెప్పేశారు. త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ కీలక నేతలు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతుండటం బీజేపీకి ఇబ్బందికరంగానే మారింది. విజయశాంతి తెలంగాణలో ఏ పార్టీ గాలి ఉందో చూసుకుని ఆ పార్టీలో చేరిపోతున్నారు. కానీ ఏ పార్టీ కూడా ఆమెకు గుర్తింపు ఇవ్వడంలేదు. ఇచ్చినా ఆమె సద్వినియోగం చేసుకునే రాజకీయం ఎప్పుడూ చేయలేదు.
2018లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న విజయశాంతి .. పార్టీ ఓడిపోవడంతో… బీజేపీ పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తున్న సమయంలో ఆ పార్టీలో చేరిపోయారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమెకు రాష్ట్రంలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన సేవలను పార్టీ వినియోగించుకోవడం లేదని పలుమార్లు ట్వీట్ల రూపంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా దూరంగా న్నారు. ఇటీవల ఎన్నికల ముందు ఆమెకు పోరాటాల కమిటీ చైర్మెన్ బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించింది. దీనిపైనా ఆమె అసంతృప్తిగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందన్న అంచనాకు రావడంతో ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపుతామని ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన హామీనిచ్చినట్టు గాంధీ భవన్లో జోరుగా చర్చ నడుస్తున్నది. రాజీనామాకు కారణం.. కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం అన్నట్లుగా చెబుతున్నారు విజయశాంతి. అయితే ఆమె గాలి ఎటు వైపు ఉంటే అటు వైపు వెళ్తారని.. రేపు బీజేపీకి మళ్లీ హైప్ వస్తే… వచ్చి చేరుతారని ఆ పార్టీ నేతలు సైటైర్లు వేస్తున్నారు.