తెలంగాణ ఎన్నికల్లో రెబల్ అబ్యర్థులు పెద్దగా లేరు. అన్ని పార్టీలు అధికారిక అభ్యర్థులకు పెను సవాలు విసిరేలా తయారైన రెబల్స్‌ను కట్టడి చేయడంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ సక్సెస్ అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ప్రధాన పార్టీల తరపున నామినేషన్లు వేసిన బలమైన తిరుగుబాటు అభ్యర్థులు మెజార్టీగా ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి సిద్దయ్యారు. దీంతో ఈ సారి తెలంగాణలో ఇండిపెండెంట్ల హవా పెద్దగా కనిపించే అవకాశం లేదు. ఒక్క ఇండిపెండెంట్ కూడా గెలవడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థఇతి ప్రకారం దాదాపు 80 స్థానాల్లో ద్విముఖ పోటీ ఉంది. మరో 30 స్థానాల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ రెబల్స్ ను బుజ్జగించడంలో ఆ పార్టీ ఎప్పుడూ లేనంతగా సక్సెస్ అయింది. ఏఐసీసీ నేతల్ని రంగంలోకి దింపి… అందర్నీ బుజ్జగించగలిగారు. అధికారంలోకి వచ్చాక అనేక పదవులు వస్తాయని, వాటిల్లో అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పారని సమాచారం. కొంత మంది తిరుగుబాటు అభ్యర్థులకు ఇప్పటి వరకూ చేసిన ఖర్చును చెల్లిస్తామని అభ్యర్థులు హమీలు ఇచ్చారు.
ప్రధాన పార్టీల రెబల్స్, బలమైన ఇండిపెండెంట్లు పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నికల్లో 80 స్థానాల్లో కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్య ముఖాముఖి పోటీనెలకొంది. గ్రేటర్ హైద్రాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బీజేపీ బలంగా ఉన్న చోట త్రిముఖ పోటీ సాగనుందని తెలుస్తోంది. త్రిముఖ పోటీ స్థానాల్లో చాలాచోట్ల పోలింగ్ తేదీ సమీపించే నాటికి ద్విముఖ పోటీ నెలకొనవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఎస్పీ, సీపీఎం పోటీ ఎవరి ఓట్లను చీల్చగలుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.