రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసుకుంటున్న విషయాన్ని రోజువారీగా బయటపెడుతున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. కౌంటర్ అంటే.. ఆయన బయట పెడుతున్న అంశాలని తప్పని.. స్కాంలు ఏమీ చేయడం లేదని చెప్పడం కాదు. నాదెండ్ల మనోహర్ చదువుతోంది చంద్రబాబు స్క్రిప్ట్ అట. కట్టప్ప నాదెండ్ల మనోహర్ అట. మంత్రి అమర్నాథ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ, జనసేనలో ఉన్నాయి. ఎవరి స్క్రిప్టులు ఎవరు చదువుతారో వాళ్లిష్టం. అది కాదు మ్యాటర్ .. అసలు స్కాంల గురించి.. ఎందుక మాట్లాడటం లేదు.
జనసేన ఇప్పటికీ రెండు స్కాంలపై వివరాలు బయట పెట్టింది. రెండింటికీ డాక్యుమెంట్స్ బయటపెట్టారు. ఆధారాలు వెల్లడించారు. ఒకటి పిల్లల్ని అడ్డు పెట్టుకుని రూ. 120 కోట్లు కాజేయడం.. రెండు జగన్ రెడ్డి బినామీకి వేల ఎకరాల భూములు అప్పనంగా సేల్ డీడ్ చేయడం. ఈ రెండు అంశాల్లో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పాలన, పాలసీలు రూపొందిస్తున్నరని క్లారిటీ వచ్చింది. వీటికి సమాధానం చెప్పాల్సిన అమర్నాథ్.. ఇది చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ ఎదురుదాడి ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపైనా.. అదే పద ప్రయోగం చేస్తున్నారు.
ఆమె టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నారని చెప్పుకొచ్చారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. అది టీడీపీ స్క్రిప్టేనంటారు కానీ.. వారు చేసిన ఆరోపణల్లో నిజం ఎంత ఉందో మాత్రం చెప్పరు. ఎదురుదాడి చేసి తమ స్కాంలను కప్పిపుచ్చుకోవాలనుకుంటారు.