ఎన్నికలు అంటే రాజకీయ పార్టీలకు లిట్మస్ టెస్ట్. అధికార పార్టీకి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాల్. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పీఠం అందుకోవడం అసలైన టాస్క్. ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థులు గెలవకపోతే చితికిపోతామని రాజకీయ యుద్ధం చేయాల్సిన, తప్పించుకోలేని గేమ్. ఇలా రాజకీయాల్లో భాగమైన ప్రతి ఒక్కరికీ విజయమో. వీర స్వర్గమో ఎన్నికలు తేల్చేస్తాయి. అయితే ప్రజాస్వామ్యంలో వీరు ఎవరు పోరాడినా.. వ్యక్తిగత బలం వల్లనే.. కసరత్తులు చేసిన కండ బలం వల్లనో.. మరో కారణంతోనే గెలవలేరు…అలాంటి కసరత్తులు చేయలేక ఓడిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే.. గెలుపోటములు పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉంటాయి. వంద శాతం ధర్డ్ పార్టీ విజేతల్ని.. పరాజితుల్ని తేల్చేది ఎన్నికల్లోనే. పోటీ చేసేది పార్టీలు.. గెలుపోటముల్ని నిర్ణయించేది ప్రజలు. అదే ప్రజాస్వామ్య గొప్పతనం. అందుకే ఓటర్లకు ప్రతీ సారి ఓ ఎన్నికలు ఓ టాస్కే. అయితే ప్రతీ సారి ఓ నిశ్చితాభిప్రాయంతో ఉండే ఓటర్లకు స్పష్టత ఉండేది. కానీ ఈ సారి మాత్రం తెలంగాణ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అభివృద్ధి చేశామంటున్న బీఆర్ఎస్.. తెలంగాణ ఇచ్చామని.. సంక్షేమంలో ముంచెత్తుతామంటున్న కాంగ్రెస్.. హంగ్ తెచ్చి అయినా పీఠం అందుకోవాలని అందుకోసం బీసీ మంత్రం పాటిస్తున్న బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్ల మైండ్ ను అటూ ఇటూ తిప్పేస్తున్నాయి. అందుకే ఈ సారి రాజకీయ పార్టీలతో పాటు .. తెలంగాణ ఎన్నికలు ఓటర్లకూ అగ్నిపరీక్షగా మారాయని అనుకోవచ్చు.
ప్రజల నాడి తెలీక బీఆర్ఎస్ సతమతం – కాంగ్రెస్ జోలికి పోవద్దని పదే పదే విజ్ఞప్తులు
భారత ప్రజాస్వామ్యం మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉంటే వారిపై ప్రజలు కోపం తెచ్చుకోవడానికి ఎంతో కాలం పట్టడం లేదు. అలాంటిది పదేళ్లుగా అదికారంలో ఉన్న పార్టీపై అసంతృప్తి పెరగడం సహజమే. కానీ ఆ అసంతృప్తి ప్రభుత్వాన్ని మార్చేయాలన్నంత స్థాయిలో ఉందా లేదా అన్నదానిపైనే స్పష్టత లేదు. అసంతృప్తి ఉందని తెలుసు కానీ… ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తమకే ఓటేస్తారని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ప్రత్యామ్నాయంగా తెర ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ మొత్తం తిరిగి గొంతు నొప్పి పుట్టేలా చెబుతున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదంటున్నారు.. కరువు వస్తుందని చెబుతున్నారు. కర్ఫ్యూలు లెక్కలేనన్ని ఉంటాయంటున్నారు. పరిశ్రమలు రావు..ఉద్యోగాలు ఉండవు.. రైతు బంధు ఇవ్వరు.. ఇలా ప్రతీది చెబుతూనే ఉన్నారు. పొరపాటున కూడా కాంగ్రెస్ జోలికి పోవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి కారణం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మార్చాలా, వద్దా అన్న సంశయంలో ఓటర్ ఉన్నాడని అనుకోవడమే. ప్రభుత్వాన్ని మార్చాలా లేకపోతే.. కొనసాగించాలా అన్న డైలమా ఉంది. ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కొన్ని అంశాల్లో..ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందన్న ఆలోచన వచ్చినా… తేల్చుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు.. అంటే రోడ్లు, మంచినీరు వంటి అంశాల్లో ప్రభుత్వం మంచి పనితీరు కనబర్చింది. కానీ ఓటర్కు తీరిపోయినసమస్యల కంటే.. ఎదురుగా ఉన్న చింతలపైనే దృష్టి కేంద్రీకరిస్తాడు. ఇలాంటి విషయాల్లో పెరిగిపోయిన ధరలు.. తగ్గిపోతున్న ఆదాయం వంటివి ఉంటాయి. ఎన్నికల్లో ఓటింగ్ కు దీన్నే ప్రయారిటీగా తీసుకుంటే.. మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలన్నంత కోపం వస్తుంది. అలాగే ప్రభత్వ పరంగా విద్య, వైద్య సౌకర్యాల విషయంలోనూ అంత సంతృప్తిగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. అందుకే మధ్యతరగతి సామాన్యుడు.. ప్రభుత్వం విషయంలో డైలమాలో ఉన్నాడు. నిత్యావసర వస్తవుల ధరలు తగ్గేలా..కుటుంబ భారాన్ని కొంత భరించేలా ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటున్నాడు.
రైతులు, మహిళలు, వ్యాపారుల్లోనూ ఖచ్చితంగా మళ్లీ ఈ ప్రభుత్వమే రావాలన్నంత హుషారు లేదు !
తెలంగాణ సమాజంలో .. రాజకీయంలో రైతు పాత్ర కీలకం. రైతు ఎటు వైపు మొగ్గితే రాజకీయం అటు వైపు మొగ్గుతుంది. రైతు కోణంలో ఆలోచిస్తే ఈ ప్రభుత్వం అంచనాలను అందుకోలేకపోయింది. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేసి కేసీఆర్ ప్రతిగా ఓట్లను అందుకున్నారు. రుణమాఫీ సహా అనేక హామీలు ఇచ్చారు. గత ఐదేళ్లలో రుణమాఫీని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఈసీ అడ్డం వచ్చిందని చెబుతున్నారు. నిన్నటికి నిన్న హరీష్ రావు ఈసీ అనుమతి ఇస్తే రేపే రుణమాఫీ జమ చేస్తామన్నారు. అసలు ఒకరి అనుమతి కోసం చూడాల్సినంత వరకూ ఎందుకు ఉన్నారన్న ప్రశ్న రైతులకు వస్తోంది. అదే సమయంలో ఈ సీజన్ లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వలేకపోయారు. ఎన్నికలు అయిపోగానే ఇస్తానంటున్నారు. 2018లో ఇవ్వగలిగిన రైతు బంధు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నది రైతుల నంచి వస్తున్న ప్రశ్న. అంతేనా రైతులకు పెద్ద సమస్యగా ధరణి మారింది. ఏ ముహుర్తంలో ధరణిని తీసుకు వచ్చారో కానీ.. ప్రతీ గ్రామంలో సమస్యలు ఉన్నాయి. రెవిన్యూ కు వచ్చే ఫిర్యాదులే దీనికి సాక్ష్యం. ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టే విపక్షాలు.. దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని ధైర్యంగా చెబుతున్నాయి. అది తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో క్షేత్ర స్థాయికి వెళ్లినప్పుడు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల దందాపై రైతుల్లో తీవ్ర స్థాయి వ్యతిరేకత కనిపిస్తోంది. ధాన్యం సేకరణ.. ఇతర అంశాల్లో దళారుల జోక్యం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నంత గొప్పగా లేదు పరిస్థితి. ధాన్యం సేకరణ సమయంలో రైతులు పడే తిప్పలు ఏమిటో వాళ్లకే తెలుసు. ఇక సాగునీటి విషయంలో ప్రభుత్వం తెలంగాణ పచ్చబడేంతగా నీళ్లు తెచ్చామని చెప్పుకుంటున్నారు కానీ .. కాళేశ్వరం కుంగిపోవడంతో అది కూడా మైనస్ అవుతోంది. మహిళా లోకానికి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఒక్క పథకం గుర్తుండదు. కేసీఆర్ కిట్ ప్రచారానికే కానీ.. ఇరవై శాతం మందికీ అందడం గగనం అన్న ఆరోపణలు ఉన్నాయి. గర్భిణికలకు పోషకాహారం ఎన్నికలకు ముందు ప్రారంభించారు. అదీ కూా ఒకటి రెండు జిల్లాల్లోనే. అసలు అత్యధికంగా ఉండే.. డ్వాక్రా మహిళలకు కేసీఆర్ ఏమీ చేయలేకపోయారు. ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇక వ్యాపారల్లోనూ ఇదే ప్రభుత్వం ఉండాలన్నంత కసి కనిపించడం లేదు. అందుకే ఇటీవల వ్యాపారవర్గాలతో హరీష్ రావు సమావేశం అయినప్పుడు.. ప్రభుత్వం మారితే.. హైదరాబాద్ కూడా అమరావతి లాగే అవుతుందని భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ వర్గాల్లో ఖ్చచితంగా ప్రభుత్వాన్ని మార్చాలన్నంత కోపం అయితే కనిపించడం లేదు. కానీ.. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలన్న ఆసక్తి కూడా పెద్దగా ఉన్నట్లుగా అనిపించడం లేదు.
ఆశల పల్లకీలో కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆశల పల్లకీలో ఉంది. కలసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్లుగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అన్నీ తమకే కలసి వస్తున్నాయని నమ్ముతోంది. తాము చేసే తప్పులు కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని భావిస్తోంది. భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉండటం .. కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డిని ప్రజలు చూస్తున్నందున ఇక తమకు తిరుగు ఉండదని కాంగ్రెస్ అనుకుంటోంది. అయితే తమ ప్రయత్నాల్లో ఎక్కడా లోపం రానీయడం లేదు. అతి విశ్వాశానికి పోవడం లేదు. గెలుపు గుర్రాలు అనుకున్న అభ్యర్థులకు ఏరి కోరి తెచ్చి టిక్కెట్లు ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థుల అర్థిక బలంతో పోటీ పడేలా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలో అందిన విజయం స్ఫూర్తితో శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. ఓ వైపు రెడ్డి సామాజికవర్గం తమ పార్టీ వైపు కన్సాలిడేట్ అవుతుందన్న నమ్మకం .. ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో పేరుకుపోయిన అసంతృప్తిని అంచనా వేసుకునే కాంగ్రెస్ ఈ ఆశల పల్లకీలో ఊరేగుతోంది. కాంగ్రెస్ నేతల కోణంలో చూస్తే.. తమ పార్టీకి లభిస్తున్న ఆదరణపై బయటకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గెలుస్తామని ఢంకా బజాయించి బయటకు చెబుతున్నారు. రాజకీయాల్లో అలా చెప్పడం ప్రాథమిక లక్షణం. కేఏ పాల్ కూడా గెలుస్తామనే చెబుతారు. అయితే రాజకీయ వాతావరణం ఎలా ఉందన్నదే ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతర్గతంగా ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకాన్ని పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది కేసీఆర్. గత ముందస్తు ఎన్నికల్లో ఆయనను గెలిచేశామని అనుకున్నారు కానీ..కేసీఆర్ చివరి రోజుల్లో మలుపు తిప్పేశారు. ఓటింగ్ కు వెళ్లే సరికి పరిస్థితి తారుమారైపోయింది. అందుకే కేసీఆర్ ను తక్కువ అంచనా వేయలేక.. గట్టిగా గెలుస్తామని ఆశలు పెట్టుకోలేక పోతున్నారు.
హంగ్ కోసం బీజేపీ రాజకీయం
ఎలా ఆలోచించారో.. ఏం ఆలోచించారో తెలియదు కానీ.. బీఆర్ఎస్ తో ముఖాముఖి పోరాడాల్సిన బీజేపీ పరిస్థితి దిగజారిపోయింది. అయితే ఆ పార్టీ ఓ ప్లాన్ తో రాజకీయం చేస్తోంది. పూర్తి స్థాయిలో గెలుపు కన్నా హంగ్ మీద దృష్టి పెట్టి ఇరవై సీట్లు తెచ్చుకుని కింగ్ మేకర్ కాకుండా కింగ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది. బీజేపీ హైకమాండ్ కు ఓ స్పష్టమైన విజన్ ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు బలాబలాల్ని అంచనా వేసుకుని తాము గెలవగలిగే సీట్లపై పూర్తి స్థాయిలో దృష్టిపెడతారు. బలహీనంగా ఉన్న చోట్ల సమయం వెచ్చించరు. తెలంగాణ విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. గతం సగంతి వదిలేసి..ఇప్పటి ఎన్నికలపై దృష్టి పెట్టారు. బీజేపీకి గెలుపు అంటే… మెజార్టీ సాధించడం మాత్రమే కాదు.. అలా సాధించడం క్లిష్టంగా మారినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. అదే అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు అనేది తమ చేతుల్లో ఉండే అన్ని సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందు కోసం బీజేపీకి క్లియర్ చాన్సులు ఉన్న 23 స్థానాలపై దృష్టి పెట్టారు. గతంలో బలంగా ఉన్న… రెండో స్థానంలో నిలిచిన… గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన సీట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. ఈ జాబితాలో మొత్తం 23 సీట్లు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముథోల్ వంటి చోట్ల రెండో స్థానంలో నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా పన్నెండు స్థానాల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అలాగే గ్రేటర్ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. అక్కడ పలు నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి అంచనా వేసుకుని కొన్ని నియోజకవర్గాలపై గురి పెట్టింది. మహబూబ్ నగర్ జిల్లలాలో కల్వకుర్తి వంటి చోట్ల విజయానికి తగ్గరగా వచ్చి ఆగిపోతుంది. ఇలాంటి నియోజకవర్గాలన్నీ ఎంపిక చేసుకుని బలమైన అభ్యర్థులు ఉన్నారనుకున్న చోట్ల గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇరవై మూడు సీట్లలో విజయం సాధిస్తే సీన్ మొత్తం మారిపోతుంది. ఇందుకోసం బీజేపీ అన్ని రకాల సామాజిక సమీకరణాల ప్రయోగం చేస్తోంది. బీసీ సీఎం నినాదంతో వచ్చింది. మాదిగ రిజర్వేషన్లకు కమిటీని ప్రకటించిది. పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకుంది. ఇదంతా దక్షిణాది సోషల్ ఇంజినీరింగ్ వ్యూహం. దక్షిణాదిన ఎంత వర్కవుట్ అవుతుందో తెలియదు. కానీ బీజేపీ లక్ష్యం మాత్రం హంగేనని అర్థం చేసుకోవచ్చు.
స్పష్టమైన తీర్పు ఇవ్వడమే తెలంగాణ ఓటర్ కు అగ్నిపరీక్ష
ఎన్నికల బరిలో ఉన్న బీఎస్పీని తక్కువ అంచనా వేయలేం కానీ ఆ పార్టీ ప్రభావం ఓట్ల చీలిక వరకే ఉంటుంది. ఎవరో ఒకరు విజయావకాశాల్ని దెబ్బతీస్తుంది. సిర్పూర్లో ప్రవీణ్ కుమార్ కు గెలిచే చాన్స్ ఉండవచ్చు. ఎలా చూసినా గాల్లో తేలుతున్న కాంగ్రెస్ కు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం లేదు. ఏదో విధంగా కేసీఆర్ గెలిపించేస్తారని బీఆర్ఎస్ నేతలూ అనుకోలేకపోతున్నారు. బీజేపీ నేతలు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు. వారి ఆసలు హంగ్ పైనే ఉన్నాయి. కానీ ప్రజలు డిసైడైతే.. పంజాబ్, కర్ణాటకల్లో ఏకపక్ష తీర్పు ఇస్తారు కానీ.. హంగ్ పరిస్థితి రానివ్వరేమోనన్న అభిప్రాయం కూడా ఉంది. ఎలాచూసినా ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం పార్టీలకే కాదు ఓటర్కూ అగ్నిపరీక్షే. అయితే అంతిమంగా ఏ నిర్ణయం తీసకున్నా అది కరెక్టే. ఎందుకంటే… ప్రజా తీర్పుకు ప్రత్యామ్నాయం లేనే లేదు.