విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది… ! నిజమా అని ఆశ్చర్యపోయి ఎవరు చెప్పారు అని చెక్ చేస్తే ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పినట్లుగా తేలింది. అదే సమయంలో విశాఖ రైల్వేజోన్ పనులు అసలేమీ ఆగలేదు అని కూడా ఆయన ప్రకటించారు. అబ్బా.. పనులు ఆగడానికి అసలు ప్రారంభమైతేనే కదా అని చాలా మంది ఇంకా ఆశ్చర్యపోయారు. ఇంత విచిత్రమైన ప్రకటనలతో జీవీఎల్ ఎవర్నీ నమ్మించాలనుకుంటున్నారు ? ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారు ? ఇంకెవర్నీ విశాఖ ప్రజల్నే.
ఐదేళ్ల కిందట విశాఖ రైల్వేజోన్ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఒక్క అడుగు ముందుకుపడలేదు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఓ నిర్ణయం అమలు చేయడానికి ఐదేళ్లు సరిపోదా ?. దీనికి సమాధానం చెప్పలేరు కానీ.. పనులు జరుగుతున్నాయని కబుర్లు చెబుతారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం ఖరాఖండిగా చెబుతోంది. కానీ జీవీఎల్ మాత్రం ఆగిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్గతంగా జరగాల్సిన పనులన్నీ పూర్తి చేస్తున్నారు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియతో జీవీఎల్‌కు సంబంధం లేదు . అయినా అదేదో తానే ప్రైవేటీకరణ ప్రక్రియ చేపడుతున్నానని.. ఆపేస్తున్నానని చెప్పుకొస్తున్నారు.
జీవీఎల్ నరిసంహారావు విశాఖ లోక్ సభ సీటుపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒంటరిగా బీజేపీ పోటీ చేసే పరిస్థితి అయితే అయన ఖర్చెందుకని ఇటు వైపు కూడా వచ్చే వారు కాదు. అయితే టీడీపీ లేకపోతే వైసీపీతో పొత్తు ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్న ఆయన వారాంతాల్లో విమాన చార్జీలు పెట్టుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. విశాఖలో 90శాతం మంది బీజేపీ నేతలు ఆయన మొహం కూడా చూడరు. అయినా విజయసాయిరెడ్డి ఆయన కోసం అన్నీ సెట్ చేసి పెడుతూ ఉంటారు. ఆయన మద్దతుతో విశాఖ లోక్ సభ పీఠంపై కన్నేశారు
జీవీఎల్ వ్యవహారం చూసి… హైకమాండ్ కు చాలా సార్లు ఫిర్యాదులు వెళ్లాయి. అందుకే ఆయన ప్రాధాన్యతను హైకమాండ్ పూర్తిగా తగ్గించింది. ఇప్పుడు అధికార ప్రతినిధి హోదా లేదు. ఓ సాదాసీదా ఎంపీ మాత్రమే. రేపు పదవి కాలం పూర్తయితే పట్టించుకునేవారే ఉండరు.