అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే ఆరు గ్యారంటీతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఆ ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా.. ఇంకా తమ దగ్గర చాలా పథకాలు ఉన్నాయని కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా వెల్లడించింది. 42 పేజీల్లో 62 ప్రధాన అంశాలతో ఈ మేనిఫెస్టో ఉంది. అమలు చేస్తారా లేదా అన్నది సంగతి తర్వాత కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది ఓటు చాయిస్ కాంగ్రెస్ అనిపించుకోవడానికి అవసరమైన అన్ని హామీలను కూర్చారు
తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, నూతన వ్యవసాయ విధానం, రైతు కమిషన్ ఏర్పాటు వంటి ప్రధాన హామీలుున్నాయి. 18 ఏళ్లు నిండి చదువుకునే ప్రతీ విద్యార్థిని ఓ ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సహా పాత బకాయిలు చెల్లింపు వంటి హామీలు ప్రధానంగా ఉన్నాయి. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే తల్లి/తండ్రి/భార్యకు రూ.25 వేల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేయనున్నట్లు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ప్రతి జిల్లాలో ఉండే డిమాండ్లు.. వివిధ వర్గాల ఆశలు, అంచనాలు తెలుసుకుని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రధాన పార్టీగా రేసులో ఉండటం.. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో.. బీఆర్ఎస్ మేనిఫెస్టో గత పదేళ్ల పాలనే అన్నట్లుగా ఉంది. కానీ కాంగ్రెస్ కు మాత్రం.. అధికారంలో లేకపోడమే ప్లస్ అవుతోంది. ఈ మేనిఫెస్టోను ఓటర్లు ఏ మాత్రం నమ్మినా.. ఓట్ల వెల్లువ ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.