ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయని.. టీడీపీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె ప్రభుత్వంపై ఎప్పట్లాగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో కలిసి వెళ్తామని పురందేశ్వరి చెబుతున్నప్పటికీ.. జనేసన పార్టీ మాత్రం ఇప్పటికే టీడీపీతో పొత్తును ఖరారు చేసుకుంది. నియోజకవర్గ స్థాయి వరకూ సమన్వయం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రెండు పార్టీల నేతలు కలిసి పని చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎక్కడా బీజేపీని కలుపుకుని పోవాలని అనుకోవడం లేదు. బీజేపీ గురించి పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే ఎక్కడ వైసీపీ చీఫ్ ల కేసులు కదులుతాయోనని ఆ పార్టీ సానుభూతిపరులు కొంత మంది అడ్డం పడుతున్నారు. పొత్తులు వద్దే వద్దని అంటున్నారు. కానీ పురందేశ్వరి మాత్రం పొత్తులు ఖాయమనుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. మొదట జనసేన ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంది. కానీ తర్వాత బీజేపీతో పొత్తుల ప్రతిపాదనలు రావడంతో అంగీకరిచింది. మొత్తంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ అయితే చేస్తున్నారు కానీ.. ప్రచారాలు చేయడం లేదు.
అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోనూ పొత్తుల అంశంపై బీజేపీ వైపు నుంచి కొన్ని చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉండే అవకాశం ఉండటంతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ టీడీపీతో కలవాలంటే.. బీజేపీ వైపు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా చాలా ఎక్స్ ట్రీమ్ నిర్ణయాలను టీడీపీ ఎక్స్ పెక్ట్ చేస్తుంది. అలా జరిగితేనే పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది.