వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో ఆ పార్టీ నేతలు ఎవరూ స్పందించడం లేదు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఎప్పుడైనా స్పందిస్తే ఆయన పదవి నుంచి తీసేస్తామని బెదిరింపులకు దిగేవారు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. అయితే హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసినా సైలెంట్ గా ఉన్న దళిత వర్గాలు ఇప్పుడు వైసీపీపై తిరుగుబాటు చేస్తున్నాయి. హోంమంత్రి నియోజకవర్గం అయిన కొవ్వూరులోని దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడి ఆత్మహత్య ఘటన దళిత వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. వైసీపీ పార్టీకి చెందిన జడ్పీటీసి సమీప బంధువు అయినప్పటికీ పోలీసులు వ్యవహరించిన తీరుతో దళిత యువకుడు తన చావుకు కారణం ఎవరో చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. దళితులంటే ఎంత చిన్నచూపు చూస్తున్నారో వారికి క్లారిటీ వస్తోంది. నిజానికి ఇంత కాలం అధికార పార్టీలో ఉన్నామనో.. అధికార పార్టీకి భయపడో.. సైలెంట్ గా ఉన్నారు. ఇంకా సైలెంట్ గా ఉంటే.. తమను ఇక లేవనీయరని అర్థమైంది. గిరి గీసి బరిలోకి దిగుతున్నారు. దొమ్మేరులో లో పోలీసులు బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు. హోంమంత్రి వనిత కొవ్వూరులో ఉండలేక విజయవాడ వెళ్లిపోయారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ చేయిస్తామని ఆమె చేసిన ప్రకటన మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. సీఐడీ అంటే కామెడీ అయిపోయింది. ఏ రిపోర్టు కావాలంటే ఆ రిపోర్టు ఇస్తారు.
ఇక్కడ కూడా మోసం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరిగిన దాడుల విషయంలో దళిత సంఘాలు రోడ్డెక్కాలని భావిస్తున్నాయి. సంచలనం సృష్టించిన కేసుల్లోనూ నిందితులని పట్టుకోకపోవడం.. కేసులు పెట్టకపోవడం డోర్ డెలివరీలు చేసిన వారిని పక్కన పెట్టుకుని ప్రోత్సహించడం వంటివాటిపై తగ్గకుండా పోరాటం చేయాలని అనుకుంటున్నారు.