జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్ని రాజకీయంగా చేసే ధైర్యం లేదు. ప్రత్యర్థుల్ని ఎలిమేనేట్ చేయడం ద్వారా గెలవాలనుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు పొంది గెలిచే చాన్స్ లేదని ఆయనకు భయం పట్టుకుంది. పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి అదే తంతు. ఇప్పుడు అది పీక్స్ కు చేరుతుంది. ప్రతిపక్ష నేతలు ప్రజలు దగ్గరకు వెళ్లకుండా…వ్యతిరేకుల ఓట్లు లేకుండా చూసుకుని ఎన్నికలు గెలిచేద్దామనుకుంటున్నారు.
రెండు నెలల కిందట ఎటు చూసినా టీడీపీనే
రెండు నెలల కిందట ఎటు చూసినా టీడీపీనే ఉండేది. రాజమండ్రిలో నిర్వహించిన మహానాడును సూపర్ సక్సెస్ చేసుకున్న టీడీపీ అక్కడే మినీ మేనిఫెస్టోను ప్రకటిచింది. ఆరు ప్రజాకర్షక హామీలను ఇచ్చి.. గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించింది. చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల ఆలస్యానికి వ్యతిరేకంగా యుద్ధ భేరీ అని.. భవిష్యత్ కు గ్యారంటీ అని పలు రకాల కార్యక్రమాలతో క్రమంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ఓ విడత ప్రచారం చేశారు. పార్టీ నేతలకూ అసైన్ మెంట్ ఇచ్చారు. పార్టీ నేతలంతా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరో వైపు నారా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. కుప్పంలో ప్రారంభమైన యాత్ర.. ఓ చరిత్ర సృష్టించే దిశగా సాగుతోందన్న అభిప్రాయం టీడీపీ క్యాడర్ లో ఏర్పడింది.
చంద్రబాబుతో ప్రారంభించి అరెస్టులే అరెస్టులు
ఇలా టీడీపీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో రాజకీయ పర్యటనలో ఉన్న సమయంలోనే చంద్రబాబును కర్నూలులో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికి ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ చిన్న సాక్ష్యం లేకపోయినా ఆయనను ఇప్పటికీ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. మరో వైపు వరుసగా ఆరు కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టులో 17ఏ కేసు తీర్పు రావడంలేదు. మరో వైపు టీడీపీ ఇంచార్జుల్ని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. టార్గెటెడ్ ఏ చిన్న వివాదం జరిగినా హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. సంగం డెయిరీలో ఎక్కడో గొడవ జరిగింది ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు పెట్టారు. కడపలో ఇద్దరు ఇంచార్జుల్ని అరెస్టు చేశారు.
టీడీపీ నేతలపై కేసులు అరెస్టులు -తాము ప్రచారం ప్రారంభించుకున్న వైసీపీ
ఇప్పుడు జగన్ రెడ్డి త మపార్టీ నేతల్ని ప్రజల వద్దకు పంపుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు బ్రేక్ పడటంతో వైసీపీ అందుకుంది. బస్సు యాత్రలు.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలను ప్రకటించి అమలు చేస్తోంది. ఇంటింటికివెళ్తోంది. మరో వైపు సీఎం జగన్ వివిధ అబివృద్ధి పనుల పేరుతో నియోజకవర్గాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇది ఘోరమైన రాజకీయమని.. ప్రత్యర్థుల్ని అధికారం ఉంది కదా అని తప్పుడు కేసుల్లో ఇరికించి వారందర్నీ జైలుకు పంపి తాను ఎన్నికలకు వెళ్లాలనుకోవడం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రజల స్పందన ఏమిటో.. వైసీపీ నేతలకు అర్థమవుతూనే ఉంది. కానీ వారి ధైర్యం వేరే…దానికి ప్రజాస్వామ్యంతో సంబంధం లేదు.