అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారంనాడు ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో గల 294 స్థానాలకు తమ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంటే ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆమె చాలా ముందు నుంచే సిద్దం అయ్యేరని అర్ధమవుతోంది.
ఈ ఎన్నికలలో తృణమూల్ తో పొత్తులు పెట్టుకోవాలని ఆశపడిన కాంగ్రెస్ పార్టీకి ఆమె దీనితో పెద్ద షాకే ఇచ్చినట్లయింది. కనుక కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో చేతులు కలిపే ప్రయత్నం చేయవచ్చును. మమతా బెనర్జీ ఇంత సంసిద్ధంగా ఉన్నట్లు బీజేపీ కూడా ఊహించక పోవడంతో అది కూడా షాక్ తింది. డిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం ఆ కారణంగా తీవ్ర అప్రదిష్టను మూటగట్టుకొన్న మోడీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలోనయినా గౌరవ ప్రధమయిన స్థానాలు సంపాదించుకోవాలనుకొంటోంది. కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రదర్శించిన ఈ దూకుడుతో కంగు తిని ఉండవచ్చును. ఈ ఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలవగలదన్నట్లుగా ఆమె కనబరుస్తున్న ఆత్మవిశ్వాసం, బీజేపీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేట్లుగా ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమె నిన్న ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో మొత్తం 45మంది మహిళలకు, 57మంది మైనార్టీలకు అవకాశం కల్పించారు.