తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కంచుకోటగా మార్చుకున్న నియోజకవర్గం అది. తెలంగాణ ఉద్యమం ఎగసినపడిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన నేతగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఆయన పోటీ చేస్తున్న పాలకుర్తిలో తిరుగు ఉండదని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఈ సారి అంత గొప్పగా లేదని నియోజకవర్గంలో పరిస్థితులు అంచనా వేస్తే స్పష్టమవుతోంది.
ఎన్నారై కుటుంబం కాంగ్రెస్ తరపున ఆయనపై పోరాడుతోంది. ఝాన్సిరెడ్డి అనే ఎన్నారై గత ఏడాది నుంచి పాలకుర్తి కాంగ్రెస్కు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే ఆమెకు పౌరసత్వ సమస్యలు రావడంతో ఆమె కోడలు యశస్విని రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దించారు. ఎర్రబెల్లిని ఓడించిన తర్వాతనే తాను అమెరికా వెళ్తానని ఝాన్సీరెడ్డి సవాల్ చేసి రాజకీయం చేస్తున్నారు. ఝాన్సీ రెడ్డి రాజకీయం ప్రారంభించినప్పటి నుండి పాలకుర్తిలో రాజకీయాలు క్రమంగా మారిపోయాయి. ఎర్రబెల్లిని ఓడించగలరు అనే నమ్మకాన్ని ముందు ప్రజల్లో ఏర్పరిచారు. ఏ కార్యక్రమం నిర్వహించినా భారీగా చేపడతారు.
పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి ఝాన్సీ రెడ్డి బలైన నేతగా ఎదిగారు. బలమైన ప్రత్యర్థి ఉంటే ఎర్రబెల్లి దయాకర్ రావుకు గట్టి పోటీ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఉంది. పైగా ఎర్రబెల్లి మంత్రి అయ్యాక క్యాడర్ కు దూరమయ్యారు. అందరి ఆశలు తీర్చలేకపోయారు. దీంతో మండల స్థాయిలో చాలామంది నేతలు దూరమయ్యారు. వారందర్నీ ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ లో చేర్చగలిగారు. ఆమె ఎర్రబెల్లితో పాటు జనాల్ని ఆకర్షించగలిగే స్థితికి చేరారు పరిస్థితిని వెంటనే గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకున్న ఎర్రబెల్లి… నియోజకవర్గంలోనే ఎక్కువ సేపు గడిపారు. అడిగిన వారందరికీ కాదనకుండా ఆర్థిక సాయంచేశారు.
కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి గందరగోళంలో ఉంది. నియోజకవర్గంలో 26 ఏళ్ల యశస్విని రెడ్డి గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితి గమనించిన ఎర్రబెల్లి.. ఆమె గెలిచినా ఇక్కడ ఉండరని..అమెరికా వెళ్లిపోతారని… ప్రచారం చేస్తున్నారు. తాను అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. పాలకుర్తి ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటే.. ఎర్రబెల్లి తన రాజకీయ జీవితంలో అతిపెద్ద దెబ్బ తింటారు.