సెకండ్ ఇన్నింగ్స్‌ని చాలా పద్ధతిగా ప్లాన్ చేస్తూ వచ్చాడు సునీల్. వరుసగా అన్నీ కీలకమైన పాత్రలే. పుష్పతో తన మైలేజీ మరింత పెరిగింది. తమిళ నాట నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. గెటప్పులు మార్చి, సీరియస్ లుక్స్ లో అదరగొడుతున్నాడు. అయితే తనలోని కామెడీ టైమింగ్ మళ్లీ చూడాలని అభిమానుల ఆశ. చిరంజీవి సినిమాతో అది తీరబోతోంది.
చిరంజీవి – వశిష్ట కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో సునీల్ కి ఓ మంచి పాత్ర పడింది. ఈమధ్య నెగిటీవ్ రోల్స్ తో సీరియస్ వేషాలతో అదరగొడుతున్న సునీల్.. ఇప్పుడు తనదైన శైలిలో కామెడీ పండించే పాత్ర పడిందని తెలుస్తోంది. సునీల్ కి చిరు అంటే చాలా ఇష్టం. ఇంద్ర, స్టాలిన్, అందరివాడు లాంటి చిత్రాల్లో మెరిశాడు. అయితే ఆయా పాత్రలకు అంత ప్రాధాన్యత గానీ, పరిధి కానీ లేవు. వశిష్ట సినిమాలో మాత్రం పూర్తి స్థాయి పాత్ర దక్కిందట. అందుకే సునీల్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడిగా నటిస్తున్నాడన్న విషయం తెలుగు 360 ముందే చెప్పింది. రానా ఎంట్రీ గురించిన ప్రకటన త్వరలోనే రానుంది. రావు రమేష్‌కి సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర దక్కిందని టాక్. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో 6 పాటలతో పాటు రెండు బిట్ సాంగ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.