విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామి తన అడ్రస్ మార్చుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక నుంచి హైదరాబాద్ లోనే ఉంటానని చెబుతన్నారు. తాజాగా ఆయన పుట్టిన రోజున విశాఖ శారదాపీఠంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. వచ్చే ఏడాది తన షష్టిపూర్తిని హైదరాబాద్ లో జరుపుకుంటానని.. ఇక విశాఖ పీఠంలో తన చిట్టచివరి పుట్టిన రోజు ఈ ఏడాదిదేనన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కోకాపేటలో శారదా పీఠానికి రెండు ఎకరాలు ఇచ్చారు. అక్కడే అధ్యాత్మిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసుకుని.. పరిశోధనల్లో గడిపేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ భూములపై ఇప్పటికే కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి. అయితే ఎలాంటి స్టే రాలేదు. ఈ కారణంగా ఆయన హైదరాబాద్ కు మకాం మార్చే విషయంలో నమ్మకంగా ఉన్నారు. ఇటీవల కేసీఆర్ కోసం రాజశ్యామల యాగం కూడా నిర్వహించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి ప్రోత్సాహంతో స్వామిగా ఎదిగారు స్వరూపానంద. అయితే ఇప్పుడు సుబ్బరామిరెడ్డి దివాలా తీశారు. కానీ స్వరూపానంద మాత్రం సుబ్బరామిరెడ్డి కన్నా అధికారంలో ఉండే రాజకీయ నేతల్ని కాకాపట్టడంలో రాటుదేలిపోయారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆయన యాగాలు చేశారు. ఇద్దరూ కాళ్లపై పడి నమస్కారాలు చేస్తారు. విశాఖలోనూ స్వరూపానందకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. అయినా.. స్వరూపానంద తాను హైదరాబాద్ కే పరిమితమవుతానని చెబుతూండటం ఆసక్తికరంగా మారింది.