ఇండియా టుడే ఇంగ్లిష్ మ్యాగజైన్ ఎన్నికలు జరుగుతున్న ఐదురాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్కు ప్రత్యేకహోదా ఇస్తూ భారీ ఇంటర్యూ కవర్ చేసింది. మంచి పబ్లిసిటీతో మార్కెట్లోకి వచ్చింది. అయితే అందులో ఉన్న అంశాలు పాత విషయాల్ని బయటకు తీసుకు వచ్చి.. వివాదం సృష్టించేలా ఉన్నాయి. అవే హైలెట్ అవుతున్నాయి. దీంతో ఈ ఇంటర్యూ మిస్ ఫైర్ అవుతుందేమో అన్న కంగారు బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది.
బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారిన అంశాల్లో మొదటిది దళిత సీఎం నినాదం. కేసీఆర్ ఆ హామీ విషయంలో తాను వెనక్కి తగ్గలేదని చెప్పేశారు. మరి ఎప్పుడు చేస్తారన్నది మాత్రం చెప్పలేదు. దీంతో గతంలో ఆయన ఇచ్చిన దళిత సీఎం నినాదం హైలెట్ అవుతోంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితుడ్ని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానన్నారు. తీరా తెలంగాణ వచ్చాక కేసీఆర్ సీఎం అయ్యారు. తెలంగాణకు దళిత సీఎం అనేది పక్కకుపోయింది. తొలి టర్మ్ లో ఉపముఖ్యమంత్రి అయినా ఉన్నారు కానీ.. రెండో టర్మ్ లో అది కూడా లేదు. ఇక ఆ హామీ గురించి అందరూ మర్చిపోయారనుకున్నారు కానీ.. ఇప్పుడు మళ్లీ దళితుల ఓట్ల కోసమో.. మరో కారణమో కానీ..మళ్లీ ఆ నిదాన్ని అందుకున్నారు. దీంతో విపక్షాలు ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. సీఎం అయ్యే అర్హత ఇప్పటిక దళితులుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
అదే సమయంలో కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నారని ప్రధాని వద్ద మాట్లాడిన విషయంపైనా ఇండియా టుడే ఇంటర్యూలో స్పందించారు. అది నిజమేనని కేసీఆర్ అంగీకరించారు. 70 ఏళ్లకు తాను రిటైర్ కావాలనుకుంటున్నానని.. కేటీఆర్ ను ఆశీర్వదించాలని.. సహకిరంచాలని కోరానన్నారు. తమ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణ ను మోడీ బయటపెట్టడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ అంశంలో ప్రధాని నైతిక విలువలపై చాలా విశ్లేషణలు వచ్చాయి .. కానీ ఇక్కడ కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నది నిజమని స్పష్టత వచ్చింది.
తెలంగాణ ఎన్నికలకు ముందు ఇలాంటి మీడియా ఇంటర్యూల్లో వీలైనంత వరకూ వివాదం లేకుండా పాత వైఫల్యాలు వెలుగులోకి రాకుండా చూసుకుంటారు. కానీ ఇండియాటుడే ఇంటర్యూ లో ఉన్న అంశాల్లో బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉండేవి ఎక్కువ హైలెట్ అవుతున్నాయి.