తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో ను అమిత్ షా హైదరాబాద్ లో విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో సాదాసీదాగా ఉంది. గెలుపు అవకాశాలు ఉన్న రాష్ట్రాల్లో విడుదల చేసే మేనిఫెస్టోలకు..తెలంగాణ మేనిఫెస్టోకు హస్తిమశకాంతరం తేడా ఉంది. కర్ణాటకలో గెలుపు కోసం ఉచిత పథకాలను ఎన్నో ప్రకటించారు. కానీ ఫలితం రాలేదు. మధ్యప్రదేశ్ లోనూ ప్రకటించారు. 450కే గ్యాస్ సిలిండర్ తో పాటు.. అయోధ్య రామాలయం ఉచిత దర్శనం వంటివి ఉన్నాయి. కానీ తెలంగాణకు వచ్చే సరికి ప్రజాకర్షక హామీలు పెద్దగా విలువ విలువలేదు. మొత్తం పది అంశాలపై మేనిఫెస్టోలో ప్రతిపాదనలు పెట్టారు. మహిళా సంబంధిత అంశాల్లో .. ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారికి ల్యాప్ ట్యాప్ లు ఇస్తామని.. నవజాత శిశువుల పేరు మీద డబ్బులు ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తామన్న హామీలు మాత్రమే ఉన్నాయి.
ఇక అన్నీ ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. యూపీఎస్సీ తరహాలో చేస్తాం.. కేంద్రం నుంచి నిధుల వరద పారిస్తాం అని హామీలు ఇచ్చారు. ఉజ్వల పథకం లబ్దిదారులకు నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆ పథకం కింద లబ్దిదారులు చాలా తక్కవ మంది ఉన్నారు. 95 శాతం అర్హులు కారు. మేనిఫెస్టోలో పెడతారంటూ ప్రచారం జరిగిన అనేక పథకాల గురించి ప్రస్తావన లేదు. అమిత్ షా ప్రకటించిన అయోధ్య రామాలయ దర్శనం కూడా మేనిఫెస్టోలో లేదు. కానీ వయోవృద్ధులకు మాత్రం ఉచితంగా కాశీ యాత్ర అనే స్కీమ్ పెడతామన్నారు. తమ పార్టీ విధానం అయిన బీసీ సీఎం నినాదాన్ని మేనిపెస్టోలో పెట్టారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉచిత హామీలతో ఆకర్షణీయమైన మేనిఫెస్టోలు విడుదల చేశాయి. కానీ బీజేపీ ఆ పని చేయలేకపోయింది. మేనిఫెస్టోలో నిర్దిష్టంగా చేస్తామన్న హామీలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చూస్తాం..చేస్తామన్నట్లుగా ఎక్కువ వాటిని ప్రతిపాదించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టి మారిపోవడంతో ఆ ఎఫెక్ట్ మేనిఫెస్టోపై పడిందని భావిస్తున్నారు. ఒక వేళ హంగ్ వచ్చి.. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే.. ఆర్థిక సమస్యల కారణంగా అమలు చేయలేకపోవచ్చునని.. అప్పుడు కొంత రిలీఫ్ ఉంటుందన్న ఆలోచన కూడా చేసినట్లుగా చెబుతున్నారు.