తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది స్థానాల్లో ఒక్క కూకట్ పల్లిలో మాత్రమే పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి 26వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆ రోజున కూకట్ పల్లిలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. పవన్ తో పాటు అమిత్ షా కూడా పాల్గొనేలా నిర్ణయించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆ ఒక్క బహిరంగసభ తప్ప పవన్ కల్యాణ్ ఎక్కడా ప్రచారం చేసే అవకాశాలు కనిపించడం లేదు.
తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులు అంతా.. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేని వాళ్లు కావడంతో ఎన్నికల నిర్వహణలో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక సమస్యల గురించి పక్కన పెడితే.. గట్టిగా వారి కోసం ప్రచారం చేసేవారు రావడం లేదు. ప్రతీ పార్టీకి ఆయా పార్టీల ముఖ్య నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. కానీ జనసేన నేతల పరిస్థితి భిన్నంగా ఉంది. కనీసం బీజేపీ నేతలైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ సమన్వయం చేసేవారు లేక తంటాలు పడుతున్నారు.
పవన్ ఒక్కో నియోజకవర్గానికి గంటో.. రెండు గంటలో కేటాయించి… రెండు రోజుల పాటు రోడ్ షోలు పెట్టుకుంటే బాగుంటుందని జనసేన వర్గాలు అనుకుంటున్నాయి. కానీ పవన్ ఇలా ప్రచార బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి కూడా ఒత్తిడి వస్తుందన్న ఆలోచనతో… ఆ ప్రతిపాదన విరమించుకున్నారని అంటున్నారు. మొత్తంగా ఒక్క కూకట్ పల్లి అభ్యర్థికి మాత్రమే పొత్తులో భాగంగా రెండు పార్టీలు కలిసి ప్రచారం చేయబోతున్నాయి.