విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపారు. అయితే… ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని, సంక్రాంతికి రావడం లేదని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అమెరికాలో జరగాల్సిన ఓ షెడ్యూల్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో.. సంక్రాంతికి రావడం కష్టమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. దర్శక నిర్మాతలు మాత్రం తమ వంతు ప్రయత్నాలు ఆపలేదు. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించుకొని, పోస్ట్ ప్రొడక్షన్‌కి ప్రిపేర్ అవ్వాలని చూస్తోంది.
ఆదివారం ఇండియా – ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫీవర్ టాలీవుడ్ గట్టిగా కనిపించింది. ‘పుష్ప’, ‘గుంటూరు కారం’ లాంటి భారీ సినిమాలు సైతం ఆదివారం షూటింగ్ క్యాన్సిల్ చేసేశాయి. అయితే `ఫ్యామిలీ స్టార్` షూటింగ్ మాత్రం ఆదివారం కూడా నిరాటంకంగా సాగింది. ఇప్పటి నుంచి ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ చేస్తే సంక్రాంతికి రావడం పెద్ద కష్టమేం కాదని చిత్రబృందం భావిస్తోంది. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యం అయితే, అప్పుడు రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచించాలని, ప్రస్తుతానికైతే సంక్రాంతి టార్గెట్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకొనే పని చేయాలన్నది టీమ్ ఆలోచన. దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ బలంగా ఉంది. ప్రతీ సీజన్‌లోనూ ఆయన బ్యానర్ నుంచి ఓ సినిమా విడుదలై, హిట్టు కొట్టడం ఆనవాయితీగా మారింది. ఆ సెంటిమెంట్ తప్పకూడదన్న ఉద్దేశంతోనే దిల్ రాజు.. ఫ్యామిలీ స్టార్‌ని పరుగులు పెట్టిస్తున్నారు.