‘ఆర్.ఎక్స్ 100’ అనే సినిమా చాలా మందికి జీవితాల్ని ఇచ్చింది. వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే.. ఆ తరవాత ఎవరూ ఆ క్రేజ్‌ని నిలబెట్టుకోలేకపోయారు. ఆఖరికి హీరో కార్తికేయ, దర్శకుడు అజయ్ భూపతితో సహా! `మహాసముద్రం`తో అజయ్ భూపతి డిజాస్టర్ చవిచూశాడు. పాయల్ రాజ్ పుత్‌కి మరో హిట్టు లేదు. కార్తికేయ పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. అయితే.. ఇప్పుడు `మంగళవారం`తో అజయ్ భూపతి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమాని టేబుల్ ప్రాఫిట్ గా మలిచి, నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాడు. వరల్డ్ కప్ ఫీవర్‌లోనూ ఈ సినిమాకి మంచి వసూళ్లే వచ్చాయి. ఇప్పుడు అజయ్ భూపతి తదుపరి సినిమాకి రంగం సిద్దం చేశాడు.
కార్తికేయతో అజయ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఓ యాక్షన్ డ్రామాని సెట్ చేశాడని తెలుస్తోంది. అజయ్ భూపతి కథలన్నీ ఇంటెన్స్‌తో ఉంటాయి. హీరోతో పాటు హీరోయిన్ పాత్రకూ సమానమైన ప్రాధాన్యం కనిపిస్తుంది. ఈసారీ అలాంటి కథే రెడీ చేశాడని టాక్. స్టార్స్‌తో సినిమాలు తీయడం కంటే, కొత్తవాళ్లతో, చిన్న చిన్న కాన్సెప్టుతో ప్రయోగాలు చేయడమే నయం అని అజయ్ భూపతి భావిస్తున్నాడు. అందుకే ఫామ్ లో లేకపోయినా కార్తికేయతో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ విషయాలు త్వరలోనే అధికారికంగా బయటకు వస్తాయి.