సీతారామం’తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడమే కాదు, మృణాల్కీ మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో అవకాశాలు వరుస కట్టాయి. టాలీవుడ్ లోని బిజీ హీరోయిన్లలో తాను కూడా ఒకరు. ప్రేక్షకుల్లో మృణాల్ కి ఉన్న క్రేజ్ సంగతి పక్కన పెడితే, సెట్లో మాత్రం దర్శక నిర్మాతల్ని ఆమె విపరీతంగా ఇబ్బంది పెడుతోందని టాక్. ముఖ్యంగా ప్రమోషన్లకు రమ్మన్నప్పుడల్లా ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకొంటోందట. నానితో కలిసి మృణాల్ `హాయ్ నాన్న` అనే సినిమా చేసింది. ఈ సినిమా ప్రమోషన్లని భారీగా ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే ఏ ఈవెంట్ ప్లాన్ చేసినా మృణాల్.. డుమ్మా కొట్టేస్తోందట. ‘నాకు ఖాళీ లేదు. వేరే షూటింగ్ ఉంది’ అని ప్రతీసారీ… ఏదో ఓ సాకు చెబుతోందట. అందుకే ఈ సినిమా ప్రచారం మొత్తాన్ని నాని తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ‘సీతారామం’ తరవాత చేస్తున్న సినిమా ఇది. తను ఎంత.. ఎఫెక్ట్ పెట్టాలి? తన పేరు కాపాడుకోవడానికి ఎంత కష్టపడాలి? అయితే మృణాల్ మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోందని తెలుస్తోంది. సెట్ కి కూడా చెప్పిన సమయానికి రావడం లేదని, తన ఆటిట్యూడ్ చూపిస్తోందని దర్శక నిర్మాతలు వాపోతున్నారు. దిల్ రాజు కాంపౌండ్ లో తను `ఫ్యామిలీ స్టార్` సినిమాలో నటిస్తోంది. అక్కడా ఇదే సీన్ రిపీట్ అవుతోందట.
ఈ విషయంలో మృణాల్ లాంటి వాళ్లు శ్రీలీలని చూసి నేర్చుకోవాలి. టాలీవుడ్ లో అత్యంత బిజీయెస్ట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొంది శ్రీలీల. తన చేతి నిండా సినిమాలే. శ్రీలీల డేట్లని దృష్టిలో ఉంచుకొని, దర్శక నిర్మాతలు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవొచ్చు. అలాంటి శ్రీలీల కూడా.. పబ్లిసిటీకి టైమ్ కేటాయిస్తోంది. తన సినిమా ప్రమోషన్లలో అందరికంటే తాను ముందుంటోంది. అందుకే దర్శక నిర్మాతలు శ్రీలీల బెస్ట్ ఆప్షన్ అనుకొంటున్నారు. సినిమాల ద్వారా క్రేజ్నీ, డబ్బునీ సంపాదించే కథానాయికలు, ప్రమోషన్ల విషయంలో ఇలా.. ఇబ్బంది పెట్టడం సబబు కాదు. ఈ విషయంలో శ్రీలీలని ఆదర్శంగా తీసుకోవాల్సిందే.