చంద్రబాబునాయుడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అడడంకులు దాదాపుగా తొలగిపోయాయి. స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు .. ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు పెట్టిన షరతులను 29వ తేదీ వరకే వర్తింప చేసింది. ఆ తర్వాత ఎటువంటి షరతులు ఉండవు. అంటే అప్పట్నుంచి చంద్రబాబు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ నెల ఇరవై ఎనిమిది లోపు చంద్రబాబు ఆరోగ్య నివేదికను ఏసీబీ కోర్టుకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో కర్నూలులో పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నుంచి 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ వచ్చింది.ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అందుకే చంద్రబాబు 29 నుంచి మళ్లీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
మరో వైపు చంద్రబాబును రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చేసేందుకు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో.. బెయిల్ పై వచ్చిన సమయంలో కొత్తగా మద్యం, ఇసుక అంటూ కేసులు నమోదు చేశారు. వాటి ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టుల్లో ఉన్నాయి. వాటిపై విచారణలు సాగుతున్నాయి. మరో వైపు 17ఏ కేసులో తీర్పు అనుకూలంగా వస్తే అసలు ఏ సమస్యా ఉండదు. చంద్రబాబుపై పెట్టినవన్నీ అక్రమ కేసులుగా తేలుతాయి.